పాత వడ్డీ రేట్లే.. అంచనాలకనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం

పాత వడ్డీ రేట్లే.. అంచనాలకనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఆర్భీఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ  కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినట్టు ప్రకటించింది. ఇంతకు ముందు రెపో రేటు 6.5శాతం ఉండగా.. ఇప్పుడూ అదే శాతాన్ని కొనసాగించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆయన నేతృత్వంలో అక్టోబర్ 6న పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించగా.. ఈ రోజు ఆ నిర్ణయాలను ఆయన ప్రకటించారు. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాల్గోసారి కావడం గమనార్హం.

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు అవకాశాలున్నాయని నిపుణులు కొన్ని రోజులుగా అంచనా వేస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు శక్తికాంత దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని తెలిపారు. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్భణం 5.4శాతం ఉండొచ్చని అంచనా వేశారు.

ప్రస్తుతం 6.8శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం 5.2శాతానికి తగ్గొచ్చని ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరిగినా పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.