ఆర్‌‌బీఐ రేట్లు మారలే!

ఆర్‌‌బీఐ రేట్లు మారలే!

ముంబై: ఆర్‌‌బీఐ పాలసీరేట్లను ఈసారి కూడా మార్చలేదు. ఎకానమీని గట్టెక్కించడానికి, ధరలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) శుక్రవారం ప్రకటించింది. గతంలో మాదిరే రెపోరేటు 4 శాతంగా, రివర్స్‌‌రెపోరేటు 3.2 శాతంగానే కొనసాగుతుంది. ఆర్‌‌బీఐ చివరిసారిగా గత ఏడాది మే నెలలో పాలసీరేట్లను మార్చింది. డిమాండును పెంచడానికి వడ్డీరేట్లను విపరీతంగా తగ్గించింది. అప్పటి నుంచి ఏడుసార్లు ఎంపీసీ సమావేశం అయినా, ఒక్కసారి కూడా రేట్లలో మార్పులు తీసుకురాలేదు. ఎంపీసీలోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులు పాతరేట్లను కొనసాగించడానికే మొగ్గుచూపారని ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్ మీడియాకు చెప్పారు. ‘‘గత రెండు నెలల్లో ఇన్‌‌ఫ్లేషన్‌‌ (ధరల పెరుగుదల) ఆరు శాతానికి చేరింది. ఎకానమీకి మరింత సపోర్టు కావాలి. ఈ రెండు విషయాలను లెక్కలోకి తీసుకొని రేట్లను ఎప్పట్లాగే ఉంచాం. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనాకు వచ్చాం. రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 5.7 శాతం వరకు ఉండొవచ్చు. రివకరీ మొదలైనప్పటికీ, అది అన్ని సెక్టార్లలో ఒకేలా లేదు కాబట్టి అవసరమైన సెక్టార్లకు ప్రభుత్వం తగిన సాయం చేయాలి. ఎకానమీని గాడిన పడేయడానికి మా వంతుగా అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని వివరించారు. రెట్రోస్పెక్టివ్‌‌ ట్యాక్స్‌‌ను ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని కామెంట్‌‌ చేశారు. ఇప్పటికీ సప్లై సమస్యలు పూర్తిగా తొలగక పోవడం, పెట్రోల్‌‌ ధరలు ఎక్కువ కావడం వల్ల ఇన్‌‌ఫ్లేషన్‌‌ ఎక్కువగా ఉందని అన్నారు. 
బ్యాంకుల కోసం టీఎల్‌‌టీఆర్‌‌
కష్టాల్లో ఉన్న బిజినెస్‌‌లకు బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి మరింత గడువు పెంచేందుకు ‘టార్గెటెడ్‌‌ లాంగర్‌‌–టెర్మ్‌‌ రీఫైనాన్సింగ్‌‌ ఆపరేషన్స్‌‌ ప్రోగ్రామ్‌‌’ ను ఆర్‌‌బీఐ ప్రకటించింది. దీనివల్ల లోన్లు ఇవ్వడానికి బ్యాంకులకు అదనంగా మూడు నెలల గడువు లభిస్తుంది. కరోనా వల్ల ఏర్పడ్డ క్రైసిస్‌‌ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం నుంచి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆర్‌‌బీఐ మెచ్చుకుంది. ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్‌‌ అవుతోందని, కరోనా ఎఫెక్ట్‌‌ పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి తాము కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నామని ప్రకటించింది. మార్కెట్లోకి మరింత డబ్బును తేవడానికి ఈ నెలే ‘గవర్నమెంట్‌‌ సెక్యూరిటీ అక్విజిషన్‌‌ ప్లాన్‌‌ 2.0’ను మొదలుపెడతామని ఆర్‌‌బీఐ ఈ సందర్భంగా పేర్కొంది. రూ.50 వేల కోట్ల విలువ చేసే గవర్నమెంటు సెక్యూరిటీలను కొనేందుకు వేలం నిర్వహిస్తామని తెలిపింది. అన్ని సెక్టార్లకూ తగినంత డబ్బు అందుబాటులోకి తేవడానికే ఈ ప్రయత్నమని దాస్‌‌ వివరించారు. ఈ నెల 12, 26 తేదీల్లో వేలం ఉంటుంది. మార్కెటుకు లిక్విడిటీని అందించడానికి ఇక నుంచి కూడా ఓఎంఓలు, ఆపరేషన్‌‌ ట్విస్ట్‌‌ వంటివి కొనసాగిస్తారు. బ్యాంకుల నుండి అదనపు లిక్విడిటీని పొందడానికి రూ .2 లక్షల కోట్ల విలువైన వేరియబుల్ రేట్ రివర్స్ రెపో  వేలాలను కూడా సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ప్రకటించింది.


కరోనా ఎఫెక్ట్‌‌ పూర్తిగా పోలేదు. ఎకానమీకి ఇంకా సపోర్ట్ అవసరం. ఇన్‌‌ఫ్లేషన్‌‌ కూడా ఎక్కువే ఉంది. రికవరీ మొదలైంది కానీ అన్ని సెక్టార్లలో ఒకేలా లేదు. అందుకే మా పాలసీ రేట్లను మార్చలేదు. వడ్డీరేట్లను పెంచలేదు. తక్కువ వడ్డీకి హోంలోన్లు దొరకడం వల్ల ఎకానమీకి మేలు జరుగుతుంది. బిట్‌‌కాయిన్‌‌ వంటి క్రిప్టోకరెన్సీలపై మాకు ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే అవి రెగ్యులేటరీ మెకానిజం పరిధిలోకి రావు. మరికొన్ని నెలల్లో డిజిటల్‌‌ రూపాయిని తెస్తాం. రెట్రోస్పెక్టివ్‌‌ ట్యాక్స్‌‌ను ఎత్తేయడం సరైన నిర్ణయం.                                                               -ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌