హౌసింగ్‌‌, రియల్ ‌‌ఎస్టేట్‌‌కు ఆసరా.. వడ్డీరేట్లు మార్చని ఆర్‌బీఐ

హౌసింగ్‌‌, రియల్ ‌‌ఎస్టేట్‌‌కు ఆసరా.. వడ్డీరేట్లు మార్చని ఆర్‌బీఐ
  • రెపో రేటు 4 శాతం రివర్స్‌‌ రెపో 3.35 శాతం
  • భవిష్యత్‌‌లో వడ్డీ రేట్ల కోతకు చాన్స్‌‌
  • చివరి క్వార్టర్‌‌‌‌లో గ్రోత్‌‌ పెరుగుతుంది
  • మార్కెట్లు పాజిటివ్ రియాక్షన్

ముంబైవడ్డీ రేట్లను మార్చకపోయినా, మార్కెట్లో తగినంత లిక్విడిటీ వచ్చేలా రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా చొరవ తీసుకుంది. రెపో, రివర్స్‌‌ రెపో రేట్లను ఆర్‌‌‌‌బీఐ మార్చలేదు.ఎక్కడి రేట్లను అక్కడే ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)లోని ఆరుగురు సభ్యులు రెపో రేటును 4 శాతంగా ఉంచేందుకే మొగ్గు చూపినట్టు పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్  చెప్పారు. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే ఉంచారు. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)లో ముగ్గురు కొత్త సభ్యులు జయంత్ వర్మ, అషిమా గోయల్, శశాంక భిండేలు నియామకం అయిన తర్వాత జరిగిన తొలి మీటింగ్ ఇదే. ప్రస్తుతం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌‌‌‌బీఐ.. ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేందుకు మున్ముందు రేట్ల కోత ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. ఎకనమిక్ గ్రోత్‌‌కు సపోర్ట్ ఇచ్చేందుకు ఈ ఏడాది మార్చి నుంచి ఆర్‌‌‌‌బీఐ రెపో రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రాబోయే కాలంలో 50 బేసిస్‌‌ పాయింట్ల దాకా రేట్ల కోత ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.5 శాతానికి పడిపోతుందని ఆర్‌‌‌‌బీఐ అంచనావేసింది. ఏప్రిల్–జూన్ క్వార్టర్‌‌‌‌లో  జీడీపీ 23.9 శాతం నెగెటివ్‌‌లోకి మారింది. ఎకనమిక్ గ్రోత్ ఈ ఏడాది చివరి క్వార్టర్ జనవరి–మార్చిలోనే పాజిటివ్‌‌గా మారుతుందని  శక్తికాంత్ దాస్ అన్నారు. కరోనా లాక్‌‌డౌన్ విధించడంతో రెగ్యులర్‌‌ బిజినెస్‌‌ యాక్టివిటీపై దెబ్బపడింది. దీంతో గ్రోత్ నెగెటివ్‌‌లోకి వెళ్లిందని దాస్ చెప్పారు. రూరల్ ఎకానమీలో రికవరీ మరింత బలపడుతుందన్నారు. కరోనా కేసులు పెరగడం, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్‌‌తో అర్బన్ డిమాండ్ కాస్త వెనకబడిందని అన్నారు. ఫ్యాక్టరీలు, సిటీలు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయని, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ రికార్డు స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.  అగ్రికల్చర్ అవుట్‌‌లుక్ చాలా బాగుంటుందని, ఆయిల్ ధరలు కూడా మళ్లీ కోలుకున్నాయన్నారు.  2020–21 నాలుగో క్వార్టర్‌‌‌‌లో ఇన్‌‌ఫ్లేషన్ కూడా టార్గెట్ లెవెల్‌‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవల నెలల్లో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ 6 శాతాని కంటే ఎక్కువగా ఉంది. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ.. మనం రివైవ్ అవుతామనే ఆశాభావాన్ని దాస్‌‌ వ్యక్తం చేశారు.గ్రోత్ రికవరీ అయ్యేంత వరకు ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.

మార్కెట్‌‌లో లిక్విడిటీని పెంచి, ఎకనమిక్ యాక్టివిటీకి సపోర్ట్ ఇవ్వడానికి దాస్ పలు చర్యలను ప్రకటించారు. ఫైనాన్స్ కండిషన్లను సరళతరం చేసినట్టు చెప్పారు. రూ.1 లక్షల కోట్ల టార్గెటెడ్ లాంగ్ టర్మ్  రెపో ఆపరేషన్స్‌‌ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని దాస్ ప్రకటించారు. ఇవి రెపో రేటుతో లింక్ అయి ఉంటాయి. కేవలం కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేలా ఈ ఫండ్స్‌‌ను బ్యాంక్‌‌ల వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. సంస్థలకు నగదు కొరతను తగ్గించేందుకు ఆర్‌‌‌‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. స్పెషల్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లను కూడా ఆర్‌‌‌‌బీఐ కొననుంది. 2022 మార్చి వరకు ఈ వెసులుబాటు ఇచ్చింది. వచ్చే వారం రూ.20 వేల కోట్ల ఓఎంఓ(ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) ఆక్షన్‌‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది. స్టేట్ లోన్లకు ఓఎంఓలను నిర్వహించడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో ప్రభావితమైన ఎక్స్‌‌పోర్టర్ల కోసం.. ఆర్‌‌‌‌బీఐ సిస్టమ్ బేస్డ్ ఆటోమేషన్ కాషన్ లిస్టింగ్‌‌ను తీసేసింది.

ముఖ్యమైన సెక్టార్లకు మరిన్ని అప్పులు…

ఎకానమీ గ్రోత్‌‌కు సపోర్ట్ ఇచ్చే అత్యంత ముఖ్యమైన సెక్టార్లకు అప్పులిచ్చేందుకు అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌‌లతో కొలాబరేట్ అయ్యేలా ‘కో ఒరిజినేషన్ మోడల్’ను తీసుకొచ్చింది. ఈ మోడల్‌‌తో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా బ్యాంక్‌‌లతో కోలాబరేట్ అయి, ప్రయారిటీ సెక్టార్లకు అప్పులు ఇవ్వనున్నాయి. ‘కో లెండింగ్‌‌ మోడల్’తో ఎకానమీలో అనధికారిక, అధికారిక రంగాలకు అప్పులు దొరకడం మరింత మెరుగవుతుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. 2018లోనే ఆర్‌‌‌‌బీఐ ఇలాంటి ఫ్రేమ్‌‌వర్క్‌‌ను తెచ్చింది.

ఎల్లవేళలా ఆర్‌‌‌‌టీజీఎస్...

రియల్‌‌ టైమ్‌‌ గ్రాస్‌‌ సెటిల్‌‌మెంట్‌‌ సిస్టమ్(ఆర్‌‌‌‌టీజీఎస్‌‌) ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌ నుంచి 24x7x365 పద్ధతిలో అందుబాటులోకి రానుందని ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్‌‌‌‌టీజీఎస్‌‌ను  ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే వాడడానికి వీలుంటోంది. అది కూడా కేవలం వర్కింగ్‌‌ డేస్‌‌లో మాత్రమే కుదురుతోంది. 24 గంటల పాటు రియల్‌‌టైమ్‌‌ పేమెంట్‌‌ సిస్టమ్‌‌ను కొనసాగిస్తున్న కొద్ది దేశాల సరసన ఇండియా చేరుతోంది.

హౌసింగ్ సెక్టార్‌‌‌‌ మరింత ఆకర్షణీయంగా..

హౌసింగ్‌‌, రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్లకు తక్కువ వడ్డీకే అప్పులు దొరికేలా ఆర్‌‌బీఐ చర్యలు తీసుకుంది. ఇందుకోసం రిస్క్ వెయిటేజిని రేషనలైజ్ చేయాలని ఆర్‌‌‌‌బీఐ నిర్ణయించింది. దీంతో హౌసింగ్ సెక్టార్‌‌‌‌ను మరింత ప్రమోట్ చేయొచ్చని, అటు అప్పులు తీసుకునే వాళ్లకి, ఇటు అప్పులు ఇచ్చే వాళ్లకి కూడా మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చనేది ఆర్‌‌బీఐ ఆలోచన. తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో రుణాలు అందుబాటులోకి వస్తాయి. హై వాల్యూ ప్రాపర్టీలు కొనడానికి తక్కువ వడ్డీకే అప్పులివ్వడం వల్ల డిమాండ్‌‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా హౌసింగ్‌‌, రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్లతోపాటు అనుబంధ సెక్టార్లన్నీ గ్రోత్‌‌ సాధించడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు.  రిస్క్ వెయిటేజి రేషనలైజేషన్‌‌తో బ్యాంక్‌‌లకు క్యాపిటల్ ప్రొవిజన్ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌ను తగ్గించింది. దీంతో హౌసింగ్ లోన్ ప్రొడక్ట్‌‌లను బ్యాంక్‌‌లు మరిన్ని ఫీచర్లతో తీసుకురానున్నాయి. ఎకానమీ రికవరీలో హౌసింగ్ సెక్టార్‌‌‌‌ అత్యంత కీలకమైనదిగా ఉంది. ఎంప్లాయ్‌‌మెంట్ జనరేషన్‌‌లో, దానికి సంబంధించిన ఇతర ఇండస్ట్రీలను ప్రమోట్ చేయడంలో హౌసింగ్‌‌ కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే రిస్క్ వెయిటేజ్‌‌ని రేషనలైజ్ చేశామని దాస్ చెప్పారు.  బలహీనంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌కు ఊతమిచ్చేందుకు  ఆర్‌‌‌‌బీఐ ప్రకటన సాయం చేస్తుందని ఎక్స్‌‌పర్ట్‌‌లు అంటున్నారు.

సెన్సెక్స్ ర్యాలీ

భవిష్యత్‌‌లో వడ్డీ రేట్ల కోత ఉంటుందని ఆర్‌‌‌‌బీఐ సంకేతాలు ఇవ్వడంతో ఫైనాన్షియల్ స్టాక్స్ లాభాలు పండించాయి. దీంతో వరుసగా ఏడో సెషనూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 326.82 పాయింట్లు లాభపడి 40,509.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 79.60 పాయింట్ల లాభంతో 11,914.20 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ ప్యాక్‌‌లో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్‌‌‌‌గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ ట్విన్స్, ఎస్‌‌బీఐ, ఎల్ అండ్ టీ, ఓఎన్‌‌జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో జీడీపీ పాజిటివ్‌‌గా మారనుందని శక్తికాంత్ దాస్ చెప్పడంతో మార్కెట్లు ర్యాలీ చేశాయని ట్రేడర్లు చెప్పారు. రేటు సెన్సిటివ్ స్టాక్స్ అన్ని పాజిటివ్‌‌గానే ఉన్నాయి.

హోమ్ ఫైనాన్స్ కంపెనీల రిస్క్ వెయిటేజీని తగ్గించడం ఇనొవేటివ్ విధానం. దీంతో హోమ్ లోన్ రేట్లు తగ్గుతాయి. రియల్ ఎస్టేట్ సెక్టార్, హౌసింగ్ కంపెనీలకు బూస్టప్ వస్తుంది. రేట్ల కోత లేకుండానే మార్కెట్లకు సానుకూలమైన ప్రకటన తెచ్చిన తొలి పాలసీ ఇదే. బాండ్ మార్కెట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది..

– వీకే విజయకుమార్, జియోజిత్  ఫైనాన్సియల్ సర్వీసెస్

పాలసీ రేటు కోత లేకపోయినా ఈ సారి మానిటరీ పాలసీ ప్రకటన సానుకూలంగా ఉంది.  ఎకానమీ కోసం అవసరమైనవన్నీ చేస్తామని ఆర్‌‌‌‌బీఐ సిగ్నలిచ్చింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌‌ను పెంచడం ఇందులో భాగమే. ఒకవేళ డిసెంబర్‌‌‌‌లో రేటు కోత లేకపోతే.. ఫిబ్రవరిలో కచ్చితంగా ఉండొచ్చు.

– అభీక్ బారువా, చీఫ్ ఎకనమిస్ట్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్