ఇన్​ఫ్లేషన్​ను 4 శాతానికి తగ్గిస్తాం

ఇన్​ఫ్లేషన్​ను 4 శాతానికి తగ్గిస్తాం

న్యూఢిల్లీ:  ఇన్​ఫ్లేషన్​ను (ధరలభారం) 4 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తామని, అయితే ఎల్ నినో వల్ల వర్షాలు తక్కువ పడితే తమ ప్రయత్నాలకు సవాళ్లు ఎదురవుతాయని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.  ఇంతకు ముందు అంచనా వేసినట్లుగానే,  2024 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు చెప్పారు. అవన్నీ ఆయన మాటల్లోనే..  గత ఏడాది మే నుంచి సెంట్రల్ బ్యాంక్ రేట్లను 2.50 శాతం పెంచడంతోపాటు, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ ఏడాది మేలో ఇన్​ఫ్లేషన్​ 4.25 శాతానికి తగ్గింది.

ఇక ముందు కూడా ఇన్​ఫ్లేషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. 2024 ఆర్థిక సంవత్సరం లో ఇది 5.1 శాతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. దీనిని 4 శాతానికి తగ్గించడానికి ప్రయత్నిస్తాం.  వడ్డీ రేట్లకు, ఇన్​ఫ్లేషన్​కు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఇన్​ఫ్లేషన్ 4 శాతానికి తగ్గితే ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గించగలుగుతుంది. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది.  అయితే ముడిచమురు ధరల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని బ్యారెల్​ ధరలు76- డాలర్లకు పడిపోయాయి. ఆహార  ద్రవ్యోల్బణం  కూడా తగ్గింది. భారత ఆహార సంస్థ గోధుమలు,  బియ్యం నిల్వలను విడుదల చేయడం వంటి చర్యలు కూడా సహాయపడ్డాయి. కొన్ని ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం వల్ల మేలు జరిగింది. 

కొన్ని సమస్యలు ఉన్నాయ్​...

‘భౌగోళిక రాజకీయ సమస్యలు, అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు, వర్షాభావం వల్ల ధరలు పెరుగుతున్నాయి.  ఈసారి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ఆశిస్తున్నాం. ఎల్ నినో గురించి ఆందోళనలు ఉన్నాయి. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాలి. బ్యాంక్ క్రెడిట్ వృద్ధి దాదాపు 16 శాతం స్థిరంగా ఉంది.  ప్రాజెక్ట్ లోన్లు సహా కార్పొరేట్ల నుంచి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి విలువ స్థిరంగానే ఉంది. డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్​బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. యుఎస్ ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం ఉండకపోవచ్చు. యుఎస్‌‌‌‌‌‌‌‌లో రేట్లు 5 శాతం పెరిగినప్పటికీ రూపాయి స్థిరంగా ఉంది. కరెంటు ఖాతా లోటు గురించి ఆందోళన లేదు. సేవల ఎగుమతులు బాగుండటం,  తక్కువ క్రూడ్ ధరలు మనకు అనుకూలంగా ఉన్నాయి. రూ.రెండు వేల నోట్లలో మూడింట రెండోవంతు వెనక్కి వచ్చాయి’ అని దాస్ అన్నారు.