ఇక షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

ఇక షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్
  • ఆర్సీ స్మార్ట్​ కార్డు నేరుగా వాహనదారుని ఇంటికి 
  • త్వరలో హైదరాబాద్​లో ప్రయోగాత్మకంగా అమలు
  • వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్
  • ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లోకి
  • మన రాష్ట్రంలో పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కారు

హైదరాబాద్, వెలుగు: కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్  కోసం వాహనదారులు ఇకపై ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి, ఆర్సీ చేతికి ఇచ్చేదాకా వేచిచూడాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ అయ్యేలా రవాణా  శాఖ ఏర్పాట్లు  చేస్తోంది. ఇందుకోసం రవాణా శాఖ కొత్త సాఫ్ట్​వేర్​ను రూపొందిస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా కొన్ని షో రూంలలో అమలు చేసి, వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షోరూంలలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

బ్రోకర్లకు చెక్

ఆర్టీఏ ఆఫీసుల్లో బ్రోకర్ల ప్రమేయం పెరిగిపోయింది. లర్నింగ్​ లైసెన్సులు మొదలు రిజిస్ట్రేషన్ల దాకా కమీషన్లు ఇవ్వనిదే పని జరగడం లేదు. ముఖ్యంగా కొత్త వాహనం కొనుగోలు చేసిన వినియోగదారులు తమ వెహికిల్ రిజిస్ట్రేషన్  కోసం రోజుల తరబడి ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చేయి తడిపితేగానీ అనుకున్న టైంలో రిజిస్ట్రేషన్​ పూర్తవడం లేదు. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల బాధ్యతను షోరూంల యజమానులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా రవాణా శాఖపైనా పనిభారం తగ్గతుందని భావిస్తున్నారు. 

నిజానికి షోరూంలలో రిజిస్ట్రేషన్లపై 2016 లోనే కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. అందుకు అనుగుణంగా పక్కనే ఉన్న ఏపీ సహా అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని చాలా ఏళ్లుగా అమలు చేస్తున్నాయి. కానీ, మన రాష్ట్రంలో నాటి బీఆర్ఎస్​ సర్కారు ఈ విధానాన్ని అమల్లోకి తేలేదు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే షోరూంలలో వాహన రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టింది. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆమోదముద్ర వేయడంతో మొదట హైదరాబాద్​లో, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా షోరూంలలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పోస్ట్​లో ఆర్సీ కార్డు.. 

ఈ విధానం అమల్లోకి వస్తే వాహనం కోనుగోలు చేసిన షోరూం నుంచే  రిజిస్ట్రేషన్​ ఫీజును ఆన్ లైన్ లో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెంటనే రిజస్ట్రేషన్  ప్రక్రియ ప్రారంభమవుతుంది. పర్మనెంట్  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ స్మార్ట్ కార్డు పోస్టల్ లో నేరుగా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు రెండు వేలకు పైగా టూవీలర్లు, 500కుపైగా  ఫోర్ వీలర్​ వెహికిల్స్​ రిజిస్ట్రేషన్​జరుగుతోంది. షోరూం  రిజిస్ట్రేషన్ల వల్ల ఆయా వాహన యజమానులకు తిప్పలు తప్పనున్నాయి.