కప్పు కొట్టింది బెంగళూరు.. తెలుగు రాష్ట్రాల్లో RCB ఫ్యాన్స్ ఓవరాక్షన్.. పిచ్చ కొట్టుడు కొట్టిన పోలీసులు

కప్పు కొట్టింది బెంగళూరు.. తెలుగు రాష్ట్రాల్లో RCB ఫ్యాన్స్ ఓవరాక్షన్.. పిచ్చ కొట్టుడు కొట్టిన పోలీసులు

RCB Fans Celebration Or Chaos: అసలే ఆకాశానికి నిచ్చెనలు వేసే అభిమానులు.. ఎప్పుడో దశాబ్దం కిందట గెలవాల్సిన కప్ నిన్నగాక మొన్న చేతికి చిక్కింది. ఇక ఊరుకుంటారా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ రెండో ఐపీఎల్ టైటిల్ గెలవడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా మామూలు రచ్చ చేయలేదు.. ఈ శతాబ్దపు అతిపెద్ద వింత అన్నట్లుగా వీధుల్లోకి వచ్చేసి, డోలు వాయిద్యాలు, టపాసులతో అర్ధరాత్రి సమయంలో నానా హంగామా చేశారు.

ఈ గెలుపు ఉత్సాహంలో ఈసాల కప్ నామ్దే బ్యాచ్ కాస్త హద్దులు మీరింది. గెలిచింది ఐపీఎల్ కప్పా లేక ఒలింపిక్ గోల్డ్ మెడలా అనే రేంజ్‌లో రోడ్లను బ్లాక్ చేసి, పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగేలా చేసిన ఓవరాక్షన్ కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ లో పోలీసుల లాఠీ ఛార్జ్: 
హైదరాబాద్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహం ముదిరి పాకాన పడటంతో, ట్రాఫిక్ జామ్‌తో జనాలు నరకం చూశారు. పరిస్థితి చేయి దాటడంతో మన హైదరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి, తమదైన స్టైల్లో లాఠీ రుచి చూపించాల్సి వచ్చింది. కప్ గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులకు పోలీసులు వీపు విమానం మోత మోగించి మరీ క్రౌడ్ మేనేజ్‌మెంట్ పాఠాలు నేర్పారు.

కర్నూలులోనూ సేమ్ సీన్: 
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి చేసిన ఓవరాక్షన్‌తో సాధారణ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. అక్కడ కూడా స్థానిక పోలీసులు రంగంలోకి దిగి, లాఠీలకు పని చెప్పి శాంతిభద్రతలను కాపాడాల్సి వచ్చింది. అయితే 19 ఏళ్లలో కేవలం రెండు కప్పులు గెలిచినందుకే ఇంతలా రోడ్ల మీద పడి వేరేవాళ్లకు నరకం చూపించాలా? మరి ఐదేసి కప్పులు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఈ లెక్కన దేశాన్ని తిరగేయాలి కదా.. 

►ALSO READ | టైటిల్ కొట్టిన ఆర్సీబీ.. విరాట్ స్టైల్లో అనుష్క శర్మ సెలబ్రేషన్స్

సోషల్ మీడియాలో ట్రోలింగ్: 
ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి చేసిన ఓవరాక్షన్‌కి సంబంధించిన వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బెంగళూరు ఫ్యాన్స్‌ను ఏకిపారేస్తున్నారు. కప్ గెలిస్తే మీ ఇంట్లో పండగ చేసుకోండి, అంతేగానీ రోడ్ల మీదకి వచ్చి జలసాలు చేసి పక్కనోడి ప్రాణాలు తీయకండి అంటూ కొందరు క్లాస్ పీకుతుంటే.. పాపం.. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన ట్రోఫీ కదా, ఆ మాత్రం పిచ్చి పడుతుందిలే అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. కప్ గెలిచినందుకు ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు బాస్.. కానీ ఆ ఆనందం పక్కవాడికి ఇబ్బంది లేకుండా ఉండాలనే కనీస జ్ఞానం ఉంటే బాగుంటుంది. ఏదేమైనా, ఆర్సీబీ కప్ గెలిచినా.. వాళ్ల ఫ్యాన్స్ పద్ధతి మాత్రం మారలేదంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.