RCB vs CSK: సొంత గడ్డపై చెలరేగిన కోహ్లీ, షెఫర్డ్.. ధోనీ సేన ముందు భారీ లక్ష్యం

RCB vs CSK: సొంత గడ్డపై చెలరేగిన కోహ్లీ, షెఫర్డ్.. ధోనీ సేన ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్18లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో మెరుపు ఆరంభం అందించగా.. చివర్లో షెఫార్డ్ (53) రికార్డ్ అర్థ శతకం బాదాడు. సొంతగడ్డపై ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‎కు దిగింది. ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెతెల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. చెన్నై బౌలర్లను చితకబాది పవర్ ప్లేలో 71 రన్స్ పిండుకున్నారు. పవర్ ప్లే తర్వాత కూడా ఇదే దూకుడును కొనసాగించారు. వేగం ఆడే క్రమంలో 9 ఓవర్లో బెతెల్ (54) మతీశ పతిరణ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

బెతెల్ ఔట్ అయ్యాక కోహ్లీ గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‎లో క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. కోహ్లీ, బెతెల్ ఉన్నంతసేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అంచనాల మేర రాణించకపోవడంతో మందగించింది. పడిక్కల్ 17, కెప్టెన్ పటిదార్ 11, జితేష్ శర్మ 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చారు. మిడిల్ ఓవర్లలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోన్న ఆర్సీబీ.. కనీసం 200 పరుగులు అయినా చేస్తోందా అనిపించింది.

 కానీ చివర్లో ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెన్న బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 14 బంతుల్లో  6 సిక్సులు, 4 ఫోర్లు బాది మెరుపు హాఫ్ సెంచరీ (53) చేయడంతో ఆర్సీబీ 200 పరుగుల మార్క్‎ను దాటింది. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ 3, సామ్ కరన్ 1, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో ధోనీ సేన ఛేదనకు దిగింది.