మున్సిపాలిటీ చెత్తతోనే వర్షం నీరు నిలుస్తోంది : ఆర్డీఓ యరాల అశోక్ రెడ్డి

మున్సిపాలిటీ చెత్తతోనే వర్షం నీరు నిలుస్తోంది : ఆర్డీఓ యరాల అశోక్ రెడ్డి
  • ఆర్డీఓ యరాల అశోక్ రెడ్డి

చిట్యాల, వెలుగు:  పోతరాజు కుంట ఆక్రమణకు గురి కావడం, మున్సిపాలిటీ చెత్త వేయడంతో కుంటలో నీరు నిలువకుండా పూర్తిగా కుంగిపోతోందని ఆర్డీఓ యరాల అశోక్ రెడ్డి అన్నారు.  సోమవారం చిట్యాలలోని జాతీయ రహదారి 65 పై పాల సెంటర్ వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ లో వర్షపు నీరు నిలుస్తున్న ప్రదేశాన్ని  మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నీరు నిలవడంతో మూడు రోజుల నుంచి జాతీయ రహదారి 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. 

 ఎస్డీఆర్‌‌ఎఫ్,  ఫైర్, మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు నీటిని బయటికి ఎత్తేస్తున్నారన్నారు. సమస్యకు సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్‌‌కు సమర్పించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్  నేషనల్ హైవే, రెవిన్యూ, ఫైర్, మున్సిపాలిటీ అధికారులతో చర్చించి నీరు నిలవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత డ్రైనేజ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి  సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.