రియాక్టర్ పేలుడుతో 7 కిలో మిటర్ల వరకు భారీ శబ్దం

రియాక్టర్ పేలుడుతో 7 కిలో మిటర్ల వరకు భారీ శబ్దం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్​బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి నలుగురు మృతిచెందారు. ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగానే ఆ వేడికి రియాక్టర్ నుంచి ఆయిల్​లీకై ఒక్కసారిగా పేలింది.

కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో దాదాపు 7 కిలోమీటర్ల రేడియస్​వరకు భారీ శబ్దం వినిపించింది. అప్పటికే మంటలు దట్టంగా అలుముకోవడంతో అందరిలోనూ భయాందోళన మొదలైంది. రియాక్టర్​పేలిన తర్వాత మంటలు భారీగా వ్యాపించడం.. ఫ్యాక్టరీలోని మరో రియాక్టర్​కూడా పేలిపోయే ప్రమాదం ఉండటంతో యాజమాన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అలర్ట్​అయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించారు.  

సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.. 

ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియాక్టర్ పేలడం వల్లే మంటలు వ్యాపించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పరిశీలించారు. పోలీసులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కాగా, కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.