ఢిల్లీలో లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నాం

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నాం

ఢిల్లీలో  గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. గాలి నాణ్యతలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి సర్కార్ దగ్గర ఉన్న అత్యవసర ప్రణాళిక ఏంటని కోర్టు అడిగింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఎయిర్ పొల్యూషన్‌పై పోరాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామంది.అయితే ఢిల్లీలో మాత్రమే లాక్ డౌన్ విధించడం పరిమితమైన ప్రభావాన్ని చూపిస్తుందని కేజ్రీవాల్ సర్కార్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆంక్షలు అవసరమని పేర్కొంది.  భారత ప్రభుత్వం లేదా  ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ద్వారా ఈ చర్యను నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లోని తప్పనిసరి చేస్తే మేము ఈ దశను పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వారం రోజుల పాటు.. వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలు జరిగే ప్రాంతాలన్నీ కూడా మూడు రోజుల పాటు బంద్ చేయాలని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.  శనివారం ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, ప్రమాదకరమైన పొగమంచును పరిష్కరించడానికి అత్యవసర ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు, పరిస్థితి "చాలా తీవ్రమైనది"ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా ఢిల్లీ తరచూ ర్యాంకుల్లో నిలుస్తోంది. పంట పొట్టలను కాల్చడం, రవాణా నుండి వెలువడే ఉద్గారాలు,  సిటీ బయట బొగ్గు ఆధారిత ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు, అలాగే బహిరంగ చెత్తను కాల్చడం , ధూళి కారణంగా  ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. అయితే ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీలో కాస్త మెరుగుదల కనిపించింది. పంజాబ్ హర్యానాలో పంట పొట్టలను కాల్చే ప్రక్రియ తగ్గించడం వల్ల ఎయిర్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ అయ్యింది.