రామగుండం మేయర్‌‌‌‌పై అవిశ్వాసానికి రెడీ..సమావేశమైన 25 మంది కార్పొరేటర్లు

రామగుండం మేయర్‌‌‌‌పై అవిశ్వాసానికి రెడీ..సమావేశమైన 25 మంది కార్పొరేటర్లు
  • నేడు మీటింగ్ ​పెట్టుకోనున్న 35 మంది
  • కలెక్టర్​కు కాపీ ఇచ్చే అవకాశం
  • కాంగ్రెస్​ వైపు మేయర్ ​అనిల్ కుమార్​ ​చూపు

గోదావరిఖని, వెలుగు : రామగుండం మేయర్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌పై అవిశ్వాసానికి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ అంశంపై రహస్యంగా సమావేశం కాగా, మంగళవారం 25 మంది కార్పొరేటర్లు కార్పొరేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లోనే మీటింగ్‌‌‌‌ పెట్టుకుని చర్చించుకున్నారు. మళ్లీ బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన మొత్తం 35 మంది కార్పొరేటర్లు సమావేశం కాబోతున్నారని తెలిసింది. 

ఆ మీటింగ్​లో మేయర్‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌లపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకుని, కాపీని కలెక్టర్‌‌‌‌కు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా ఎంపిక చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. గతంలో తమకు తెలియకుండా మేయర్‌‌‌‌ ఒక్కరే వెళ్లి ఎమ్మెల్యేను కలిసేవారని, తమతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆగ్రహంతో ఉన్నారు. 

మేయర్‌‌‌‌తో పాటు డిప్యూటీ మేయర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ రావు కూడా తమ కాల్స్​కు స్పందించేవారు కాదని, గతంలో మేయర్‌‌‌‌ ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహకారం అందించలేదని, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ కూడా తమ పట్ల పట్టీపట్టనట్టుగా వ్యవహరించారని కార్పొరేటర్లు సీరియస్‌‌‌‌గా ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే రామగుండం మేయర్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.