రియల్ ఎస్టేట్​ బిజినెస్ ​పేరిట .. రూ.5 కోట్లకు టోకరా

రియల్ ఎస్టేట్​ బిజినెస్ ​పేరిట ..  రూ.5 కోట్లకు టోకరా

నల్గొండ అర్బన్, వెలుగు :  గజం భూమి లేకుండా...చేతిలో రూపాయి బిల్ల లేకుండా...రియల్​ఎస్టేట్​ బిజినెస్​ చేసిన కొందరు ఘనులు రూ.కోట్లు కొల్లగొట్టారు. వసూలు చేసిన డబ్బులతో కళ్లు జిగేల్​మనేలా కార్పొరేట్ ఆఫీసు పెట్టి...పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుని...ఎంత పెట్టుబడి పెడితే అంతకు డబుల్ ఏడాదిలోనే వస్తుందని నమ్మించి నట్టేట ముంచారు. పైగా దోచిన డబ్బుతో సినిమాలు కూడా తీస్తున్నారు. వీరి మోసాలను బట్టబయలు చేసి కటకటాల్లోకి తోశారు ఎస్పీ అపూర్వా రావు నేతృత్వంలో నల్లగొండ పోలీసులు. వీరు ఇప్పటివరకు 144 మంది నుంచి రూ.4.50కోట్లు స్వాహా చేయగా రూ.కోటి 36 లక్షలను పోలీసులు రికవరీ చేయగలిగారు. జిల్లా పోలీస్​ ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. 

బోగస్​ కంపెనీ పెట్టి...కార్పొరేట్​ ఆఫీసు తెరిచి... 

 హైదరాబాద్‌లోని ఓంకార్ నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్(34), బైరామల్‌గూడ పిండి నారాయణరెడ్డి కాలనీకి చెందిన బొడ్డు వెంకటేశ్(23) స్నేహితులు. వీరికి రియల్ ఎస్టేట్ బిజినెస్​లో అనుభవం ఉంది. ప్లాట్లు అమ్మడం, కొనడం ద్వారా ఆశించిన ఆదాయం రావడం లేదని కొత్త దందాకు తెరలేపారు. వేరేవాళ్లు వేసిన వెంచర్లలో ప్లాట్లు అమ్మిస్తామని సదరు యాజమానుల దగ్గర లేఔట్‌ కాపీలు తీసుకున్నారు. ఏడాది క్రితం బైరమాల్‌గూడలో గోల్డెన్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్​పేరుతో బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు పైనే బ్రోచర్లు తయారు చేయించి ‘రూ.10 లక్షలకు ప్లాట్ కొనండి..ఏడాది తర్వాత ప్లాట్ తిరిగిచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లండి’ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో చాలామంది ఆకర్శితులై ప్లాట్లు కొన్నారు. కొద్ది రోజుల తర్వాత అదే పేరుపై ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని తెలుసుకుని ఓంకార్ నగర్‌కు మకాం మార్చారు. అక్కడు ఐదు షాపులు అద్దెకు తీసుకుని గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్​లిమిటెడ్ పేరుతో కార్పొరేట్ తరహాలో ఆఫీసు ఓపెన్ చేశారు. 

ప్రొడక్షన్​ నంబర్ 1 పేరిట సినిమా షురూ...

ఆఫీసులో నానక్‌నగర్‌కు చెందిన బర్ల శేఖర్‌ను ఉద్యోగిగా నియమించుకుని ప్రతి కస్టమర్ నుంచి వచ్చే డబ్బులో అతడికి 0.8 శాతం కమిషన్​ఇచ్చేవారు. ఆఫీసు వ్యవహారాలన్నింటినీ శేఖర్​తో పాటు బొడ్డు వెంకటేశ్ చక్కబెట్టేవాడు. గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో పాంప్లేట్స్, బ్రోచర్లు, బుక్‌లెట్స్, నోట్ బుక్స్ ప్రింట్ చేయించి మార్కెటింగ్ చేశారు. ఎంత పెడితే ఏడాదిలో అంతకు డబుల్​ఇస్తామని చెప్పడంతో పాటు ప్లాట్ అగ్రిమెంట్ పేపర్లు పోస్ట్ డెటెడ్ చెక్కులు ఇచ్చేవారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఓంకార్ నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్ పేరుతో పాటు సదరు కంపెనీ పేరుపై భూమి ఉన్నట్టు, వెంచర్ లేఔట్ కాపీలను తయారు చేయించారు. 

మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేష్ కలిసి బట్టపల్లికి చెందిన మాదగోని వెంకటేశ్ గౌడ్‌ను ఏజెంట్ గా నియమించుకుని ప్లాట్లు అమ్మి పెడితే 30 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో అతడు కొంతమందిని ఏజెంట్లను పెట్టుకుని ప్లాట్లు కొనిపించాడు. వచ్చిన డబ్బులో 30 శాతం ఏజెంట్ కమీషన్ పోగా, మిగిలిన 40 శాతంతో గిరిప్రసాద్, వెంకటేశ్‌ జల్సాలు చేయడంతో పాటు సినిమాలు తీసేవారు. మరో 30 శాతాన్ని ఎవరైనా కస్టమర్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని గొడవ చేస్తే.. ఇచ్చేందుకు వీలుగా ఆఫీసులోనే దాచిపెట్టేవారు. ఆగస్టు 6న అన్నపూర్ణ స్టూడియోలో గౌతమ్స్ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్​ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ప్రొడక్షన్​నంబర్​1 పేరిట సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకు వీరు 144 మందిని మోసం చేసి రూ.4.50 కోట్లు స్వాహా చేశారు. ఒకవేళ బాధితులంతా డబ్బులు ఇవ్వాలని అడిగితే ఐపీ పెట్టేందుకు కూడా స్కెచ్ వేశారని తెలిసింది.