పంటలను ముంచిన వెంచర్

పంటలను ముంచిన వెంచర్
  • సుల్తాన్ పల్లి - కేబీ దొడ్డి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి

శంషాబాద్, వెలుగు : బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెంచర్ పంట పొలాలను ముంచింది.  వెంచర్​తో పంటలను నష్టపోతున్నామని రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్​పరిధిలోని సుల్తాన్ పల్లి – కేబీ దొడ్డి గ్రామాల మధ్య ఈసీ వాగుకు ఆనుకుని సుమారు 50 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. వాగు కల్వర్టుకు ఎత్తుగా మట్టి పోసి రోడ్లు వేశారు. వరుస వానలతో  హిమాయత్ సాగర్ చెరువులోకి వెళ్లాల్సిన వరదతో పాటు బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి చేరింది. 

దీంతో సుల్తాన్ పల్లి – కేబీదొడ్డి గ్రామాల పరిధిలోని గులాబీ, వంకాయ, బెండకాయ, ఇతర పంటలు పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వానకే పంట పొలాలు పూర్తిగా నీట మునుగుతుండగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశంతోపాటు గ్రామాలను సైతం వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. 

వ్యవసాయ పొలాల్లో వెంచర్ వద్దని గతంలో మంత్రి సబిత, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ తో పంటపొలాలతో పాటు గ్రామాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. వెంటనే వెంచర్ పై చర్యలు తీసుకొని తమను కాపాడాలని రైతులు, గ్రామస్తులు కోరారు.  వెంచర్ లో కి భారీగా వరదనీరు చేరగా  స్థానికులు చేపలు పట్టారు. ప్రజలు భారీగా చేరుకోగా శంషాబాద్ రూరల్ పోలీసులు చేపలు పట్టే పంపించివేశారు.