రికార్డు స్థాయికి రియల్ ఎస్టేట్ భూ కొనుగోళ్లు.. నిలకడగా డెవలపర్ల సెంటిమెంట్.. ఏ ఏ సిటీలో ఎంతంటే..

రికార్డు స్థాయికి రియల్ ఎస్టేట్ భూ కొనుగోళ్లు.. నిలకడగా డెవలపర్ల సెంటిమెంట్.. ఏ ఏ సిటీలో ఎంతంటే..
  • భూ కొనుగోళ్లు రికార్డు స్థాయికి.. 2025 మొదటి ఆర్నెళ్లలో 2,900 ఎకరాల లావాదేవీలు
  • 2024 కంటే 1.15 రెట్లు ఎక్కువ
  • డీల్స్​ విలువ రూ. 30,885 కోట్లు
  • అనరాక్​ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ భూముల కొనుగోళ్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో (2025 హెచ్1) దాదాపు 2,900 ఎకరాల భూమి లావాదేవీలు జరిగాయి. ఇది 2024 మొత్తం సంవత్సరంలో జరిగిన లావాదేవీల (2,515 ఎకరాలు) కంటే 1.15 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 

రియల్​ ఎస్టేట్​కన్సల్టెన్సీ అనరాక్​తాజాగా "ల్యాండ్ యాజ్ క్యాపిటల్: డీకోడింగ్ ఇండియాస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ అండ్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఫ్లోస్" పేరుతో విడుదల చేసిన రిపోర్ట్​ ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 76 భూ లావాదేవీల ద్వారా 2,898 ఎకరాల భూమి అమ్ముడయింది.  రియల్ ఎస్టేట్ రంగంలో డెవలపర్ల సెంటిమెంట్ నిలకడగానే ఉందడానికి ఈ డీల్స్​ నిదర్శనం. ఈసారి జూన్​ వరకు జరిగిన ఈ భూ లావాదేవీల మొత్తం విలువ రూ. 30,885 కోట్లుగా ఉంది. దీని ద్వారా సుమారు రూ. 1.47 లక్షల కోట్ల రాబడి, 233 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయగల సామర్థ్యం వస్తుందని అంచనా.

  మొత్తం 76 డీల్స్‌‌లో, 67 డీల్స్ (సుమారు 991 ఎకరాలు) భారతదేశంలోని టాప్​–7 సిటీల్లో జరిగాయి.  మిగిలిన 9 డీల్స్ అహ్మదాబాద్, అమృత్‌‌సర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూరు, పానిపట్ వంటి టైర్ 2,  టైర్ 3 నగరాల్లో జరిగాయి. వీటిలో 1,907 ఎకరాలకు పైగా జాగా అమ్ముడయింది. టాప్​సిటీల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్​) అత్యధికంగా 24 డీల్స్‌‌తో 433 ఎకరాలకు పైగా భూమిని దక్కించుకుంది. ఆ తర్వాత బెంగళూరు (15 డీల్స్, 182 ఎకరాలు), పూణే (13 డీల్స్, 214 ఎకరాలకు పైగా) ఉన్నాయి. నేషనల్​క్యాపిటల్​రీజియన్​(ఎన్సీఆర్​), చెన్నై, హైదరాబాద్​లోనూ పెద్ద ఎత్తున భూమి అమ్ముడయింది. 

రెసిడెన్షియల్​​ ప్రాజెక్టులకే ఎక్కువ...

మొత్తం లావాదేవీల్లో 1,200 ఎకరాలకు పైగా (54 డీల్స్) రెసిడెన్షియల్​ ప్రాజెక్టులు..అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్‌‌మెంట్‌‌లు, టౌన్‌‌షిప్ ప్రాజెక్టుల కోసం జరిగాయి. సుమారు 48.41 ఎకరాలు  (ఎనిమిది డీల్స్) వాణిజ్య ప్రాజెక్టుల కోసం, ఆరు  డీల్స్ (సుమారు 1,034 ఎకరాలు) ఇతర ప్రాజెక్టుల కోసం జరిగాయి. మూడు ఒప్పందాల్లో  537 ఎకరాలను పారిశ్రామిక  లాజిస్టిక్స్ పార్కుల కోసం కొన్నారు.  

ఒక డీల్ డేటా సెంటర్ (2.39 ఎకరాలు) కోసం, మరో డీల్​ సెమీకండక్టర్ పరికరాల యూనిట్ (25 ఎకరాలు) కోసం జరిగాయి. 2021 నుంచి  భూముల లావాదేవీలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. 2021 నుంచి 2025 మొదటి ఆరు నెలలు (హెచ్1) వరకు దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 423 డీల్స్ ద్వారా 11,858 ఎకరాలకు పైగా భూమి లావాదేవీలు జరిగాయి. 

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా లేని టైర్ 2/3 నగరాల్లో ఇప్పుడు భారీగా భూమి కొనుగోళ్లు జరుగుతున్నాయని అనరాక్​ తెలిపింది.  రాబోయే కాలంలో కూడా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.