అత్తగారింట్లో అడుగుపెట్టాక ఆమె జీవితం మారిపోయింది

అత్తగారింట్లో అడుగుపెట్టాక ఆమె జీవితం మారిపోయింది

డాన్సే కెరీర్ అనుకుని జీవితం గురించి ఎన్నో కలలు కన్న ఆమె పెండ్లి తర్వాత కూలీ పనులకు వెళ్లింది. అప్పులోళ్ల వేధింపులు ఎదుర్కొంది. అలాంటి ఆమె పోయిన ఆదివారం జరిగిన ‘డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ మూడో సీజన్’లో విజేతగా నిలిచింది. ట్రోఫీతో పాటు ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలిచింది.  ఈ విజయం వర్షని కష్టాలు, అప్పుల నుంచి బయటపడేసింది. అంతేకాదు కొడుకుని బాగా చదివించాలనే ఆమె కలని కూడా నిజం చేసింది. చిన్నప్పటి నుంచి వర్షకి డాన్స్ అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో డాన్స్​ పోటీలకు వెళ్లింది కూడా. పెద్దయ్యాక కొరియోగ్రాఫర్​​ అవ్వాలని, డాన్సే తన కెరీర్​ అని చాలా కలలు కన్నది. కానీ, ఇంట్లోవాళ్లు ఆమెకు పదిహేడేండ్ల వయసులోనే పెండ్లి చేశారు. దాంతో తనకెంతో ఇష్టమైన డాన్స్​కు దూరమైంది వర్ష. అత్తగారింట్లో అడుగుపెట్టాక ఆమె జీవితం మారిపోయింది. భర్త సుతారి పనులకు వెళ్లేవాడు. అతని సంపాదన సరిపోకపోవడంతో ఆమె కూడా కూలికి వెళ్లేది.  కొడుకుని ఎలాగైనా బాగా చదివించాలని అనుకున్నారు. కానీ, ఎలా?.  అప్పటికే వేలల్లో అప్పులు. అప్పుడే  ‘డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్స్ సీజన్​ 3’ యాడ్​ వచ్చింది. పెండ్లితో డాన్స్​కు గుడ్ బై చెప్పిన అమ్మలకు తమ కలని నిజం చేసుకునే ఛాన్స్ ఇస్తోంది ఈ షో. జీ టీవీలో టెలికాస్ట్​ అయ్యే ఈ షోలో గెలిచిన వాళ్లకు ఐదు లక్షలు ఇస్తారు. ఆ డబ్బుతో తమ జీవితం బాగుపడుతుందని అనుకుంది వర్ష.  ఎలాగైనా ఆ  పోటీలకు వెళ్లాలనుకుంది. 

టీవీలో చూసి ప్రాక్టీస్ 

‘డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్ సీజన్​ 3’ లో  అడుగుపెట్టాలంటే డాన్స్ వీడియో పంపాలి. అందుకని  ట్రైనింగ్ తీసుకుందామంటే డబ్బులు లేవు. దాంతో  రోజూ కూలి పని నుంచి ఇంటికి వచ్చాక  టీవీలో డాన్సర్​ వర్తికా ఝా డాన్స్ చేస్తుంటే చూసి ఆమెలాగ స్టెప్పులు వేయడం ప్రాక్టీస్​ చేసేది వర్ష. ఆమె డాన్స్ బాగా చేయడం చూసి భర్త ప్రోత్సహించాడు. షోలోకి వచ్చాక తన ఫేవరెట్ డాన్సర్​ వర్తిక మెంటార్​గా దొరకడంతో వర్షకి కాన్ఫిడెన్స్​ పెరిగింది. ఫ్రీ స్టయిల్, పాపింగ్, హిప్​–హాప్, బెల్లీ డాన్స్ బాగా చేసింది వర్ష. ఫైనల్​కి చేరిన ఆరుగురిలో బెస్ట్ పర్ఫార్మెన్స్​ ఇచ్చి విజేతగా నిలిచింది. 

అప్పు చేసి...

ఈ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ముంబైకి రావడానికి అప్పులు చేసింది వర్ష. అయితే.. డాన్స్ షోలో వర్ష మంచి బట్టలు వేసుకోవడం చూసి ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయనుకున్నాడు అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి.  డబ్బులు తిరిగివ్వాలని వర్ష, ఆమె భర్తతో గొడవపెట్టుకున్నాడు. దాంతో షో మధ్యలో ఆమె డాన్స్ మీద ఫోకస్​ పెట్టలేకపోయింది. టాలెంట్ ఉన్నా వర్ష సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం చూసి కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఆమెతో మాట్లాడాడు. ‘షోలో కంటెస్టెంట్స్ వేసుకునే  డ్రెస్​లు  నిర్వాహకులు ఇస్తార’ని స్టేజీ మీద చెప్పాడు. అంతేకాదు వర్ష వాళ్ల కుటుంబం చేసిన అప్పులు తీరుస్తానన్నాడు. వర్ష గురించి తెలిశాక ప్రైజ్​మనీకి అదనంగా రెండు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు స్పాన్సర్లు.