అబద్ధాలను వెంటాడుతున్న నిజాలు

అబద్ధాలను వెంటాడుతున్న నిజాలు

ఆరు దశాబ్దాల కల సాకారమైన నాడు.. యావత్తు తెలంగాణ ప్రజలు సంబురపడ్డారు. తెలంగాణ వస్తే.. తమ బతుకులు మారుతాయని, స్వరాష్ట్ర పాలనలో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఉద్యమనేత అని అధికారం కట్టబెడితే.. నియంతలా మారిన పాలకుడు.. తన ఇంటిని, కుటుంబాన్ని చక్కదిద్దుకున్నడు. సగటు మనిషి జీవనం ఎప్పటిలాగే ఉన్నది. ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో తీసుకుంటున్న నగదు(బదిలీ) పథకాల వలలో పేదలు కొట్టుమిట్టాడుతున్నారు. రాజకీయాలను వ్యాపార గణితంలా మార్చిన నాయకుడు.. ఓటర్ల నుంచి మొదలు.. లోకల్​ బాడీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆఖరికి ప్రతిపక్షాలను కూడా కొనే  సంస్కృతిని తీసుకొచ్చాడు. తన స్వార్థం కోసం... పంతం నెగ్గించుకోవడం కోసం రెండు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం తలదించుకునేలా కోట్లకొద్దీ డబ్బులు కుమ్మరించి సాధారణ ఎన్నికలను.. సామాన్య నాయకుడికి అందనంత ఖరీదు ఎన్నికలుగా మార్చాడు.

 ఎన్నడూ లేనంతంగా ఓటుకు ఆరువేల వరకు రేటు పెంచిన సదరు నాయకుడు.. పైసలు మాకెందుకు ఇవ్వలేదని రోడ్లపై జనం ధర్నాలు చేసేంతగా ఓటరు విలువను దిగజార్చాడు. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలే అని రామక్క సుద్దులు చెప్పే పాలకుడు.. గత పదేండ్ల నుంచి ప్రజలను ఓడగొడుతూనే ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కూడా ప్రజాస్వామ్యంలో విలువ లేకుండా చేసిన ఘనత గత పదేండ్లు తెలంగాణ ప్రజలు తమ నెత్తిన మోస్తున్న నాయకుడిదే. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సైతం కలిసి మెలిసి పనిచేసే ఆరోగ్యకర సంస్కృతిని పాడు చేస్తూ.. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా తన కంటే వయసులో పెద్దవారితో సైతం వరుస పెట్టి కాళ్లు మొక్కించుకునేంత రాజరికపు దుస్థితి తీసుకువచ్చిన ఘనత నియంత పాలకుడిదే.

ప్రజల్లో చైతన్యం

నిన్నటి దాకా బండబూతులు తిట్టినవారు.. ఒక్క రోజులోనే వారికి విజయ తీరాలకు చేర్చే నావలా కనిపిస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. అలాంటి నాయకులను చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి మేలు జరగకపోగా.. మరింత నష్టం జరుగుతుంది. ఇటీవల ఓ అనామకుడు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిపై చేసిన కత్తి దాడికి అధికార పార్టీ నాయకులు రాజకీయ రంగు పులిమారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకే ఈసారి అధికారం ఇవ్వాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్​ను కోరుకుంటున్నారని చెప్పడానికి అనేక ఉదాహరణలు మన కండ్ల ముందే ఉన్నాయి. కాంగ్రెస్​ టికెట్ల కేటాయింపుల సందర్భంగా వచ్చిన డిమాండే అందుకు నిదర్శనం. కమ్మ, వెలమ, రెడ్డిలు, బీసీలు, మైనార్టీలు.. ఇలా సబ్బండ వర్గాలు తమకు టికెట్లు కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్​ చేశారు. అంతమంది నుంచి ఇంతపెద్ద డిమాండ్​ ఉందంటే.. ఆ పార్టీ విజయం సాధించబోతున్నదన్నది సుస్పష్టమే కదా? అన్ని వ్యవస్థలను చెరబట్టిన నాయకుడు.. ప్రత్యర్థి పార్టీల్లోనూ కోవర్టులను పెట్టుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే కాంగ్రెస్​ అధిష్టానం ఈసారి ఏమాత్రం, ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఆచితూచి.. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. సీనియర్లు.. జూనియర్లు అనే తేడాను పక్కనబెట్టి, బలమైన నాయకులెవరో, ప్రజల ఆదరణ ఉన్నవారెవరో తేల్చుకున్న తర్వాత టికెట్లు ఇచ్చింది. ​

ధరణి ముందు నుంచే రైతుబంధు

కరెంట్​ కష్టాల గురించి మాట్లాడుతున్న బీఆర్​ఎస్​ నాయకులు.. చత్తీస్​గఢ్​ నుంచి అధికరేటు పెట్టి కొంటున్న కరెంట్​, డిస్కంల నష్టాలను రైతుల ఉచిత విద్యుత్​ ఖాతాలో వేస్తున్న తీరు, డిస్కంలను వేల కోట్ల అప్పుల్లో ముంచిన తీరు గురించి ఎందుకు మాట్లాడటం లేదో ఆలోచించాలి. 24 గంటల ఉచిత విద్యుత్​ వల్ల అసలు ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? నిజానికి రైతులు వాడుతున్నదెంత? రైతుల పేరుతో పామ్​హౌస్​ల పెద్దలు కొల్లగొడుతున్న కరెంట్​ ఎంతో లెక్కలు చెప్పాలి? ఒక్క ధరణి పోటుతో వేల ఎకరాలు భూకుంభకోణాలు చేసిన ఘనత అధికార పార్టీ నాయకులది. కాంగ్రెస్​ గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను ధరణితో పెద్దలపాలు చేశారు. 

అసైన్డ్​ భూములు గుంజుకున్నారు. ధరణి రాక ముందు గ్రామానికి 10 భూ సమస్యలు ఉంటే ఇప్పుడు..100 సమస్యలు తయారైనయ్​. ధరణి తప్పులతో భూముల కొట్లాటలు, హత్యలు, దాడులు విపరీతంగా పెరిగిన సంగతి చూస్తున్నాం. అలాంటి ధరణిని కాంగ్రెస్​ పూర్తిగా సంస్కరించబోతున్నదని చెబితే.. అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ధరణి పోర్టల్​ రాక ముందు నుంచే రైతుబంధు ఇస్తున్న సర్కారు.. ధరణి తీసేస్తే రైతు బంధు రాదంటూ అన్నదాతలకు అబద్ధాలు చెబుతున్నది. మీ అబద్ధాలకు ఎక్స్​పైరీ అయిపోయింది. మీ మాటలపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది. ప్రజా తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు, యావత్తు  ప్రజానీకం ముక్తకంఠంతో బీఆర్​ఎస్​ గద్దె దిగాలని కోరుకుంటున్నారు. ప్రజాతీర్పును ఎవరూ మార్చలేరు.

ప్రజాతీర్పును మార్చలేరు

గత పదేండ్లుగా అధికార పార్టీ చెబుతున్న విజయాల వెనుక అసలు విషయాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్​ చేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఈ భూలోకంలోనే అతిపెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకున్న పాలకులు.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఇంజినీరింగ్​, నిర్మాణ లోపాల గురించి మాత్రం కిమ్మనడం లేదు. 

ALSO READ :   టెకీలపై ఈసీ ఫోకస్.. సాఫ్ట్ వేర్​ ఎంప్లాయిస్ కు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ 

ఈ పరిణామాలన్నీ నియంత పాలకుడిని గద్దె దించేందుకు ప్రకృతి పంపుతున్న సూచనలుగా తెలంగాణ పౌర సమాజం భావిస్తున్నది. గత పదేండ్లలో విపరీతమైన అవినీతితో, అధికారంతో అన్ని వ్యవస్థలను చెరబట్టి.. ఎవరికీ అందనంత ఆకాశమంత ఎత్తుకు వెళ్లిన.. పాలకుడిని గద్దె దించడం ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు.. సామాజిక, రాజకీయ విశ్లేషకులు ఎందరో.. ఆయనను ఓడించడం సాధ్యం కాదని జోస్యం చెప్పారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి గొప్పది. ప్రజా తెలంగాణ కోసం ప్రజలు ఇవ్వనున్న తీర్పునెవరూ మార్చలేరు. 

- కమల్ మెడగోని, టీపీసీసీ మీడియా కన్వీనర్