
జీడిమెట్ల, వెలుగు : ఇంటి నిర్మాణం, లే ఔట్లకు సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్బిల్డింగ్పర్మిషన్అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్సిస్టమ్) వెబ్‌సైట్‌తో రియల్టర్లు, నిర్మాణదారులకు తిప్పలు తప్పడం లేదు. రిజెక్ట్ చేసిన అప్లికేషన్ల పైసలు వెంటనే తిరిగి రాకపోవడంతో మరోసారి అప్లయ్ చేసేందుకు నెలల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసే టైంలో రూ.10 వేలు కట్టించుకునేవారు. అధికారుల వెరిఫికేషన్ తర్వాత అన్నీ సరిగ్గా ఉంటే భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేవారు. అప్పుడు స్థలాన్ని బట్టి మిగిలిన మొత్తం కట్టించుకునేవారు. ఒకవేళ అప్లయ్ చేసే టైంలో ఏదైనా పొరపాటు చేసి ఉంటే, వెంటనే రూ.10 వేలు చెల్లించి అప్లయ్ చేసేవారు.
వారం రోజుల్లో మొదట అప్లికేషన్ టైంలో కట్టిన మొత్తం తిరిగి వెనక్కి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఎస్బీపాస్అందుబాటులోకి వచ్చాక అప్లికేషన్ ఫీజు చెల్లించే పద్ధతిని పూర్తిగా మార్చేశారు. ప్రస్తుతం అప్లికేషన్ పెట్టే టైంలోనే బిల్డింగ్పర్మిషన్కు సంబంధించిన మొత్తం అమౌంట్ కట్టాలి. ఎన్ని లక్షలైనా ముందే చెల్లించాలి. ఈ ప్రాసెస్ ప్రకారం అంతా సరిగ్గా ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటుతో అప్లికేషన్ రిజెక్ట్ అయితే నిర్మాణదారులకు ఇబ్బందులు మొదలవుతున్నాయి. భవన నిర్మాణానికి పర్మిషన్ రాకపోగా, ఆన్లైన్లో చెల్లించిన మొత్తం తిరిగి రావడానికి నెలలు పడుతోంది. మరోసారి పర్మిషన్ కోరేందుకు పైసలు లేక తిప్పలు పడుతున్నారు. హౌజింగ్ లోన్ తెచ్చుకునేందుకు, ఇతర పనులు ఆగిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని నిర్మాణదారులు కోరుతున్నారు.
ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు
చిన్న చిన్న లోపాన్ని కూడా బూచిగా చూపి కేవలం అనుమతి కోసమే అధికారులు రూ.20 వేల నుంచి రూ.50 వేలు దండుకుంటున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఓక కారణంతో అనుమతులు ఆపేస్తున్నారని వాపోతున్నారు. ఒకే వెంచర్లో కొన్ని ప్లాట్లకు పర్మిషన్ ఇచ్చి, మరికొన్నింటిని ఆపుతున్నారు. ఇక నిర్మాణ టైంలో ఒక్కో అదనపు అంతస్తుకు ఒక్కో రేట్ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.