
- వచ్చేందుకు.. పోయేందుకు ఒకే దారి
- అందుకే తప్పించుకోలేకపోయిన్రు
- అగ్నిమాపక శాఖ అధికారుల రిపోర్టు
- సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్/సికింద్రాబాద్/పద్మారావునగర్, వెలుగు : సేఫ్టీ రూల్స్ పాటించకచపోవడమే సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి కారణమని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మూడు పేజీల నివేదికలో ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. లిథియం బ్యాటరీ పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, బిల్డింగ్‌కి ఎంట్రీ,ఎగ్జిట్ ఒకటే ఉండడంతో భారీ ప్రమాదం జరిగిందని తెలిపారు. నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ రూల్స్‌పాటించలేదని, స్మోక్ డిటెక్టర్లు పనిచేయలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి బిల్డింగ్‌యజమానులు, ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహకులనే బాధ్యులుగా నిర్ధారించారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మరో నలుగురు ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసు సమీపంలోని రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం, లాడ్జీలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సెల్లార్‌లో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్స్‌లో రాత్రి 9.17 గంటలకు ఓ బ్యాటరీ పేలింది. బ్యాటరీలోని లిథియంతో ఒక్కో బైక్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే సెల్లార్‌లోని 37 బైకులు దగ్ధం అయ్యాయి. అలాగే రూబీ ఫైనాన్స్ నిర్వాహకులు సీజ్ చేసిన బైకుల పెట్రోల్ వల్ల కూడా మంటలు వ్యాపించాయి. సెల్లార్ నుంచి నాలుగు అంతస్తుల దాకా అగ్నికీలలు వ్యాపించాయి. ప్రమాదం జరిగినపుడు గుజరాత్ కు చెందిన రాజేష్ చాబ్రా,హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన మన్మోహన్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగులు లాడ్జిలోని ఐదో అంతస్తులో డిన్నర్ చేస్తున్నారు. మంటలు, పొగలు రావడంతో వారు అలర్టయ్యారు. వెంటనే హోటల్ బోయ్స్‌తో పాటు ఆరుగురు పైప్‌లైన్లతో కిందికి దిగిపోయారు. సెకండ్, థర్డ్ ఫ్లోర్‌లోని మరో నలుగురు కిందకు దూకారు. సెల్లార్ షెట్టర్ మూసి ఉండడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నాలుగో అంతస్తులో ఉన్న రూమ్‌ల్లోకి పొగ వ్యాపించింది. దీంతో ఆయా రూముల్లో ఉన్న ఐదుగురు ఊపిరి ఆడక లాడ్జిలోనే చనిపోయారు.
వివిధ పనులపై వచ్చి ప్రాణాలు కోల్పోయిన్రు
విజయవాడకు చెందిన అల్లాడి హరీష్ కుమార్ (33)కు భార్య కావ్య, ఇద్దరులు కుమారులు ఉన్నారు. 12 రోజుల క్రితమే రెండో కొడుకు పుట్టాడు. డ్యూటీలో భాగంగా ట్రైనింగ్ కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన మైత్రేయ మహాపాత్ర (26) చందన జీతి (28) దంపతులు బెంగళూరులో డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఏదో పని నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఇక చైన్నెకి చెందిన బాలాజీ (58), సీతారామన్ (48) ఆచి మసాలా కంపెనీలో ఉద్యోగులు. సీతారామన్ ఆడిటర్ గా, బాలాజీ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ముగ్గురిపై కేసు.. ఒకరు అరెస్ట్
ప్రత్యక్ష సాక్షి మన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి నిర్వాహకులు సుమిత్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా, మేనేజర్ సుదర్శన్ నాయుడును ఏ2గా చేర్చారు. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహకుడు రంజిత్ సింగ్ బగ్గాను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలకు గాంధీలో పోస్టుమార్టం నిర్వహించారు. చెన్నైకి చెందిన బాలాజీ(58), సీతారామన్(48) డెడ్‌బాడీలను కార్గో ఫ్లైట్‌లో తరలించారు. విజయవాడకు చెందిన అల్లాడి హరీశ్ కుమార్(33) బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒడిశాకు చెందిన దంపతులు చందన జీతి (28), మైత్రేయ మహాపాత్ర (26), ఢిల్లీకి చెందిన రాజీవ్ మాలిక్ (60), ఆయన సోదరుడు సందీప్ మాలిక్ (56), మరో వ్యక్తి వీరేంద్ర కుమార్ దేవకర్ (50) డెడ్ బాడీల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.
బాధ్యులను వదలేదిలేదు: కిషన్‌రెడ్డి
అగ్నిప్రమాదానికి బాధ్యులు ఎంతటి వారైనా వదలేదిలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రూబీ లాడ్జిని ఆయన మంగళవారం సందర్శించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారని తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు రూ.3 లక్షల పరిహారం ప్రకటించింది.