
ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మన యువ జట్టు గెలుస్తుందని మ్యాచ్ కు ముందు ఎవరూ అనుకోలేదు. అయితే మొదటి రోజు మన వాళ్ళ బ్యాటింగ్ చూశాక ఓటమిని ఎవరూ ఊహించి ఉండరు. తొలి ఇన్నింగ్స్ 3 వికెట్ల నష్టానికి 430 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా.. అనూహ్యంగా ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ అదే జరిగింది. కనీసం డ్రా కూడా చేసుకోలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
చెత్త ఫీల్డింగ్:
ఈ టెస్టులో భారత ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే అని చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫీల్డర్లు చాలా క్యాచ్ లు మిస్ చేశారు. జైశ్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్ లు నేలపాలు చేయగా.. జడేజా, పంత్, కరుణ్ నాయర్ తలో క్యాచ్ విడిచారు. డకెట్, పోప్, హ్యారీ బ్రూక్ క్యాచ్ లను వదిలేయడంతో వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని భారీ స్కోర్లు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ మిడ్ వికెట్ లో డకెట్ క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇలాంటి చెత్త ఫీల్డింగ్ తో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. మొత్తం 10 క్యాచ్ లు మిస్ చేయడం ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
చేతులెత్తేసిన లోయర్ ఆర్డర్:
రెండు ఇన్నింగ్స్ ల్లో భారత లోయర్ ఆర్డర్ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో చివరి 41 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అదే పరిస్థితి. చివరి 31 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులు భావించినా కనీసం 500 పరుగులు కూడా మన జట్టు చేయలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లో 450 పరుగుల ఆధిక్యం ఖాయమనుకుంటే అనూహ్యంగా కుప్పకూలారు. శార్దూల్ ఠాకూర్, కరుణ్ నాయర్, జడేజా కనీస స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు. భారత పరాజయానికి ఇదే ప్రధాన కారణం.
బుమ్రా పైనే భారం:
టీమిండియా బౌలింగ్ భారమంతా స్టార్ బౌలర్ బుమ్రా పైనే పడింది. బుమ్రా ఒక్కడే ఈ టెస్టులో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు ఆధిక్యం దక్కకుండా చూశాడు. మార్ ఎండ్ లో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోయారు. ముఖ్యంగా ప్రసిద్ వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సిరాజ్ అయితే వికెట్లు తీయడం మర్చిపోయాడు. శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసినా అప్పటికే మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బుమ్రాపై అతిగా ఆధారపడితే ఈ సిరీస్ లో భారత్ కు మరిన్ని ఓటములు తప్పేలా కనిపించడం లేదు.
ఈ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 2 న ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి గెలిచింది.