అజరుద్దీన్‌పై తిరుగుబాటు..రసాభాసగా హెచ్‌సీఏ ఏజీఎం

V6 Velugu Posted on Mar 29, 2021

  • అంబుడ్స్‌‌మన్‌‌గా దీపక్ వర్మ కోసం పట్టుబట్టిన ప్రెసిడెంట్ 
  • వద్దంటున్న అసోసియేషన్‌‌ మెంబర్స్‌‌, కబ్ల్‌‌ సెక్రటరీలు 
  • స్టేజ్‌‌ మీదనే తిట్టుకున్న అజర్, సెక్రటరీ విజయానంద్‌‌! 
  • అర్ధంతరంగా ఆగిన ఏజీఎం.. 11వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) ప్రెసిడెంట్‌‌ మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌ నియామకం విషయంలో తోటి ఆఫీస్‌‌ బేరర్లు, క్లబ్​ సెక్రటరీలు అజర్‌‌కు షాకిచ్చారు. ఆదివారం ఉప్పల్‌‌ స్టేడియంలో జరిగిన హెచ్‌‌సీఏ 85వ ఏజీఎంలో అంబుడ్స్‌‌మన్‌‌గా  రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ దీపక్‌‌ వర్మ పేరును ప్రెసిడెంట్‌‌ ప్రతిపాదించగా.. మెంబర్స్‌‌, క్లబ్‌‌ సెక్రటరీలు అంతా ఎదురుతిరిగారు. దీపక్‌‌ వర్మ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెక్రటరీ విజయానంద్‌‌ సైతం వర్మపై వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అయినా అజర్‌‌ తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేయడంతో  మీటింగ్‌‌ మొత్తం రసాభాసగా మారింది. దాంతో, ఎంతో కీలకమైన అంబుడ్స్‌‌మన్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ జరగకుండానే  ఏజీఎం అర్ధంతరంగా ఆగిపోయింది. వచ్చే నెల 11వ తేదీన మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. 
మొదటి నుంచి గొడవ
అంబుడ్స్‌‌మన్‌‌ ఎంపిక విషయంలో అజర్‌‌కు మిగతా ఆఫీస్‌‌ బేరర్లకు మధ్య  మొదటి నుంచి గొడవ జరుగుతోంది. డీడీసీఏకు అంబుడ్స్‌‌మన్‌‌గా పని చేసిన దీపక్‌‌ వర్మను అజర్‌‌ తమను సంప్రదించకుండానే ఎంపిక చేశాడని, ఆ నియామకం చెల్లదని ఆఫీస్‌‌ బేరర్లు చెప్పారు. దాంతో, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో అజర్‌‌ ఒంటరి అయ్యాడు. అయితే, తర్వాత  అందరూ కాంప్రమైజ్‌‌ అయ్యారని అంతా భావించారు. కానీ, అజర్‌‌ వైఖరిపై ముందునుంచే గుర్రుగా ఉన్న మిగతా ఆఫీస్​ బేరర్స్​  టైమ్‌‌ చూసుకొని  ఏజీఎంలో అతనికి షాకిచ్చారు. ఈ మీటింగ్‌‌లో అంబుడ్స్‌‌మన్‌‌ పోస్ట్‌‌ కోసం  ఏపీ హైకోర్టు రిటైర్డ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ నిస్సార్‌‌ అహ్మద్‌‌ ఖుక్రూ (కాశ్మీర్‌‌), హైదరాబాద్‌‌కు చెందిన రిటైర్డ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ మీనా కుమారి పేర్లు తెరమీదికి వచ్చాయి. అంబుడ్స్‌‌మన్‌‌గా ఉండేందుకు ఈ ఇద్దరూ అంగీకారం తెలిపారని సెక్రటరీ విజయానంద్‌‌ చెప్పాడు. కానీ, అజర్‌‌ మాత్రం దీపక్‌‌ వర్మ కోసం పట్టుబట్టాడు. దాంతో, మెంబర్స్‌‌ అంతా ‘నో దీపక్‌‌ వర్మ’ అంటూ స్టేజ్‌‌ ముందుకు వచ్చి నినాదాలు చేశారు. ఈ టైమ్‌‌లో అజర్​ పక్కనే కూర్చున్న మిగతా ఆఫీస్​ బేరర్లూ అతని నిర్ణయాన్ని వ్యతిరేకించారు.  దీపక్‌‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు జాయింట్‌‌ సెక్రటరీ నరేశ్‌‌ వర్మ ప్రకటించగా అజర్‌‌ అతనితో వాదనకు దిగాడు.  అలాగే, మాజీ ప్రెసిడెంట్‌‌ అర్షద్‌‌ అయూబ్‌‌.. నిస్సార్‌‌ అహ్మద్‌‌ ఖుక్రూ పేరు ప్రదిపాదిస్తున్నారని దీనిపై చర్చ జరపాలని విజయానంద్​ కోరగా.. అజర్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇద్దరూ స్టేజ్‌‌పైనే తిట్టుకోవడం కనిపించింది. దాంతో, అంబుడ్స్‌‌మన్‌‌, ఎథిక్స్‌‌ ఆఫీసర్ల ఎంపిక కోసం ఏప్రిల్‌‌ 11న జరిగే మీటింగ్‌‌లో సీక్రెట్‌‌ ఓటింగ్‌‌ పెడతామని సెక్రటరీ విజయానంద్‌‌ చెప్పారు. కాగా, ఆదివారం నాటి  ఏజీఎంకు 186 మంది మెంబర్స్‌‌ హాజరయ్యారని తెలిపారు. 12 పాయింట్ల ఎజెండాలో ఐదింటిపై చర్చించి ఆమోదం తెలిపామన్నారు. 84వ ఏజీఎంతో గత మూడు ఫైనాన్షియల్‌‌ ఇయర్స్‌‌ అకౌంట్స్‌‌కు, వచ్చే ఏడాది బడ్జెట్‌‌కు, ఆడిటర్ల జీతాన్ని 15 శాతం పెంచేందుకు ఏజీఎం ఆమోదం తెలిపిందన్నారు.  అలాగే, క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)కి మాజీ క్రికెటర్లు సుదీప్‌‌ త్యాగి, స్రవంతి నాయుడు, డయానా డేవిడ్‌‌ల పేర్లను ప్రతిపాదించగా  మెంబర్స్‌‌ ఏకగ్రీవంగా  అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అయితే, హైదరాబాద్‌‌ టీమ్‌‌కు ఆడినప్పటికీ మన స్టేట్‌‌కు చెందిన వ్యక్తి కాకపోవడంతో  త్యాగిపై వ్యతిరేకత వస్తోంది. 

Tagged AGM, hca, against, Azharuddin, hyderabad cricket association, confused

Latest Videos

Subscribe Now

More News