దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో అన్ని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకున్నారు..పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున భక్తులు చర్చిలకు తరలివచ్చారు.  హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికులతో పాటు.. విదేశీయులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

ఢిల్లీలో మాత్రం క్రిస్మస్ వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ఆంక్షల నేపథ్యంలో చర్చిలలోకి ఎవర్నీ అనుమతించలేదు. చాందినీ చౌక్ లోని బాప్టిస్ట్ చర్చి, గోల్ మార్కెట్ లోని సేక్రడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలను మూసివేశారు. దీంతో భక్తులు చర్చి బయటే ప్రార్థనలు చేశారు. మహారాష్ట్రలో ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. చర్చిల సామర్థ్యంలో 50 శాతం వరకే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిమిత సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.   

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మానవత్వానికి ప్రతీక అయిన క్రిస్మస్ ను ఘనంగా జరుపుకోవాలని కోరారుప్రధాని నరేంద్ర మోడీ.. క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

‘‘ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మానవత్వం, సేవ, దయ లాంటి వాటిని మానవాళి బోధిస్తూ బతికిన జీసెస్ జీవితాన్ని, ఆయన గొప్ప బోధనలను మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’  అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కాగా, కోల్ కతాలోని కేథడ్రల్ ది మోస్ట్ హోలి రోసరీ చర్చిని మమతా బెనర్జీ సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం చర్చి ఫాస్టర్లు మమత బెనర్జీకి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.