వడ్లు కాంటా అయ్యాక రైతులకు రశీదులు ఇస్తలే

వడ్లు కాంటా అయ్యాక రైతులకు రశీదులు ఇస్తలే
  • వడ్లు కాంటా అయ్యాక రైతులకు రశీదులు ఇస్తలే
  •  ట్రక్‌‌ షీట్లపై సంతకం తీస్కరావాలని ఆఫీసర్ల హుకుం
  •  ఏకమైన నిర్వాహకులు, ఆఫీసర్లు, మిల్లర్లు
  •  తరుగు పేరిట దోపిడీ దగా పడుతున్న రైతన్నలు 
  •  పట్టించుకోని రాష్ట్ర సర్కారు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కాంటా పెట్టాక రైతులకు రశీదు ఇవ్వాల్సిన ఆఫీసర్లు ఆ పనిచేయకుండా ట్రక్​షీట్లపై మిల్లర్లతో సంతకం చేయించుకరావాలనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రక్​షీట్లపై సంతకాల కోసం వడ్లలోడ్ ​వెంట రైతులు మిల్లర్ల దగ్గరికి పోవడం,  అక్కడ కటింగులకు ఒప్పుకుంటే తప్ప దించమని ఒత్తిడిచేయడం ఒక కుట్ర ప్రకారం జరుగుతోంది. నిర్వాహకులు, ఆఫీసర్లు, మిల్లర్లు కలిసి అక్రమాలకు పాల్పడేందుకు సర్కారే అవకాశం ఇవ్వడంతో  తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు కటింగులకు ఒప్పుకొని మునుగుతున్నారు. ఈ ప్రక్రియ వల్లే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని రైతులు, రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

రశీదులు ఇస్తలే..

ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. 17 శాతం లోపు తేమ ఉంటేనే కొనడానికి నిర్వాహకులు ఒప్పుకుంటారు. 3 శాతం మట్టి పెల్లలు, 3 శాతం తాలు మాత్రమే అనుమతిస్తారు. ఇవన్నీ సరి చూసుకున్నాక రైతులకు  బారదాన్​ ఇచ్చి వడ్లు నింపిస్తారు. ఇక కాంటా కాగానే  రైతుల బాధ్యత పూర్తయిపోవాలి. కొనుగోలు చేసిన వడ్ల బస్తాల లెక్కప్రకారం రైతులకు రశీదు ఇచ్చి ఇంటికి పంపేయాలి. ఆ తర్వాత అవి సర్కారు వడ్లు అయిపోతాయ్‌‌. ఇలా చేస్తే దోపిడీ అనేది జరగదు. కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు రశీదులు ఇవ్వట్లేదు. 

ట్రక్​షీట్లపై సంతకం తేవాలట..

ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్​లలో కాంటాలు వేసిన వడ్లను రైస్​మిల్లుల్లో దింపే దాకా రైతులే బాధ్యత వహించాలని ఆఫీసర్లు కండీషన్​ పెట్టారు. కాంటా అయ్యాక వానలు పడితే వడ్లు తడవకుండా రైతే చూసుకోవాలని, లారీలు రాకపోతే వారం, పది రోజులు వడ్ల బస్తాల వద్దే కాపలా కాయాలని చెప్తున్నారు. లారీలు రాకపోతే రోడ్ల మీదికి వెళ్లి లారీలను ఆపి తీసుకురమ్మంటున్నారు. ఇన్నీ చేసి, తీరా లారీల్లో లోడ్‌‌ చేసి ‌రైస్​మిల్లులకు పంపాక  మిల్లర్లు కావాలనే రిజెక్ట్​ చేస్తున్నారు. ఆ వెంటనే నిర్వాహకులు రైతులకు ఫోన్​చేసి, ‘మీ వడ్లను రైస్‌‌ మిల్లులో ‌రిజెక్ట్‌‌ చేశారు. వెళ్లి మాట్లాడుకొని రండి..’ అంటూ చావు కబురు చల్లగా చెప్తున్నారు. వడ్లను ఓకే చేయించుకొని  ట్రక్‌‌ షీట్‌‌పై రైస్‌‌ మిల్లర్​ సంతకం తీసుకొని రావాలంటున్నారు.

రైతులు వెళ్లేదాకా మిల్లర్లు వడ్లు దించుకోవడం లేదు. రైతులు వెళ్లాక క్వింటాల్‌‌కు ఐదు నుంచి ఎనిమిది కిలోల చొప్పున తరుగుకు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఒప్పుకుంటే ఆ మేరకు బస్తాల సంఖ్య తగ్గించి ట్రక్‌‌ షీట్లపై సంతకం చేసి పంపుతున్నారు. లేదంటే అన్​లోడ్​ చేసుకోకుండా ఇబ్బంది పెడ్తున్నారు.

నిర్వాహకులు, ఆఫీసర్లు, మిలర్లు కుమ్మక్కు..

నిబంధనల ప్రకారం 40 కిలోల వడ్ల బస్తాకు 0.70 కిలోల తరుగు తీయాలి. కానీ తప్ప, తాలు పేరిట కొనుగోలు కేంద్రం నిర్వాహకులే  2 కిలోల దాకా తరుగు తీస్తున్నారు. అంటే క్వింటాల్‌‌కు 5 కిలోలు సెంటర్​లోనే కట్​చేసి మిల్లులకు పంపిస్తున్నారు. అయినా మిల్లర్లు తాలు ఎక్కువగా ఉందని,  మట్టి వచ్చిందని, క్వాలిటీ లేవని సాకులు చెబుతూ వడ్లను దించుకోవట్లేదు. ఒక్కో లారీకి 7 నుంచి 18 క్వింటాళ్లు, డీసీఎం వ్యాన్లయితే 3 నుంచి 5 క్వింటాళ్లకు పైగా తరుగు తీయడానికి అంగీకరిస్తేనే దించుకొని ట్రక్​షీట్లపై సంతకాలు చేస్తున్నారు. నిజానికి వడ్లు మిల్లులకు పంపడం, అన్​లోడ్​ చేయించుకోవడంతోపాటు ట్రక్‌‌ షీట్లపై సంతకాలు చేయించుకునే బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సివిల్‌‌ సప్లయ్‌‌ ఆఫీసర్లదే. మిల్లర్లకు అభ్యంతరాలుంటే జేసీ లేదా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. కానీ నిర్వాహకులు, ఆఫీసర్లు, మిల్లర్లు ఏకమై తరుగు పేరిట రైతులను నిలువునా దోచుకుంటున్నారు. 


భూపాలపల్లి జిల్లా పెద్ద కుంటపల్లికి చెందిన ఐకేపీ కొనుగోలు సెంటర్‌‌ నుంచి ఈ నెల 17న 750 బస్తాల లోడ్‌‌తో ఒక లారీని ఇదే జిల్లాలోని గణపురం దగ్గర ఉన్న ఓ రైస్‌‌ మిల్లుకు పంపించారు. అక్కడ రైస్‌‌మిల్లర్‌‌ వడ్లను అన్​లోడ్​ చేసుకోలేదు. రైతులను, సెంటర్ ఇన్​చార్జీని రప్పించుకొని వాటిలో తాలు శాతం ఎక్కువ ఉందని క్వింటాల్‌‌కి 5 కిలోల చొప్పున కట్ చేశాడు.  రైతులు ఎంత బతిమిలాడినా మిల్లర్‌‌ ససేమిరా అన్నాడు. లారీపై సుమారు రూ.40 వేల విలువైన 18 క్వింటాళ్ల వడ్లను తరుగుగా తీసుకొని ట్రక్‌‌ షీట్‌‌ ఇచ్చి రైతులను వెళ్లగొట్టారు.

వడ్లు పండించి ఏం లాభం!

క్వింటాల్‌‌కు 5  కిలోల చొప్పున తరుగు తీస్తే పంట పండించి ఏం లాభం? కొనేటప్పుడే అన్నీ చెక్‌‌ చేసి కొన్నరు. తీరా మిల్లుకు పోయినాక ఇట్ల తరుగుతీస్తే ఎట్లా?  రైతులందరం కలిసి కంప్లయింట్​ చేస్తే  ‌మిల్లు కాడికి కలెక్టరేట్‌‌ నుంచి ఓ సారు వచ్చిండు. తాలు ఎక్కువనే ఉన్నది గట్లనే తరుగు తీస్తరు అన్నడు. ఇట్లయితే సర్కారు కొనుడెందుకు?  వీళ్ల కంటే ప్రైవేటోళ్లే నయం. రేయింబవళ్లు కష్టపడి రైస్‌‌మిల్లోనికి దోచిపెడుతున్నం. 
‒ గుగులోతు రమేశ్‌‌, పెద్దకుంటపల్లి   

ఇక్కడే 42 కిలోలు కాంటా పెడ్తాండ్లు!

వరి కోసి వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినం. 20 రోజులు దాటింది. చాలా మందికి కాంటాలు కావట్లే. 17 శాతం తేమ ఉంటేనే కాంటా పెడ్తున్నరు. అది కూడా 42 కిలోల చొప్పున జోకుతున్నరు. ఇక్కడే బస్తాకు కిలోన్నర తీస్తున్నరు. మళ్లీ మిల్లుకు పోయినంక తరుగు పేరిట క్వింటాల్‌‌కు ఐదారు కిలోలు తీస్తే మెమెట్లా బతుకుడు? ‒ బొల్లెపల్లి సాంబయ్య, బుర్ర రవీందర్‌‌, చిట్యాల రైతులు, భూపాలపల్లి జిల్లా