వడ్ల పైసల చెల్లింపుల్లో జాప్యం..కొనుగోళ్లలోనూ ఆలస్యం

వడ్ల పైసల చెల్లింపుల్లో జాప్యం..కొనుగోళ్లలోనూ ఆలస్యం


25 వేల మంది రైతుల్లో 8 వేల మందికే డబ్బులు జమ 
స్లోగా ఆన్​లైన్​ డేటా ఫీడింగ్ ప్రాసెస్
రూ.339.51 కోట్లకు.. వచ్చింది రూ.93 కోట్లే
 4.52 లక్షల టన్నుల టార్గెట్‌కు 1.64 లక్షల టన్నుల సేకరణ
 
    
కరీంనగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్లతోపాటు వడ్ల పైసల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడి వడ్లు అమ్ముకున్న రైతులకు సకాలంలో డబ్బులు జమ కావడం లేదు. వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తామని మంత్రులు,  అధికారులు చెప్తున్నప్పటికీ.. 15, 20 రోజులు గడిచినా పైసలు పడడం లేదు. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గురువారం నాటికి 25,619 మంది రైతుల నుంచి రూ.339.51 కోట్ల విలువైన 1,64,808 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటివరకు 8,146 మంది రైతులకే రూ.93 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి.  

ఆన్‌లైన్​ డేటా ఫీడింగ్ లేటు

జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 50,  డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 47,  హెచ్ఏసీఏ ఆధ్వర్యంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. మొత్తం 336 సెంటర్ల ఓపెన్ చేశారు. వీటిద్వారా గురువారం వరకు 25,619 మంది రైతుల నుంచి 1,64,808 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో ఇప్పటివరకు 17,530  రైతుల పేర్లను, 97 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఆన్‌లైన్ చేశారు. దీంతో చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. 


కొనుగోళ్లలోనూ ఆలస్యం 

యాసంగిలో వరి సాగు విస్తీర్ణాన్ని(2.62 లక్షల ఎకరాలు) బట్టి 6.20 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు 
అంచనా వేశారు. ఇందులో 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినా, 4.52 లక్షల మెట్రిక్‌టన్నుల వడ్లు ప్రభుత్వమే కొనాలని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ జిల్లాలో వడ్ల కొనుగోలులో మొదటి నుంచి ఆలస్యం జరుగుతోంది. తేమ పేరిట కొర్రీలు పెడుతూ ఆరబెట్టాక 17 శాతం లోపు మాయిశ్చర్ వస్తేనే కాంటాలు పెడుతున్నారు. 

అంతేగాక రైస్ మిల్లుల్లోనూ ట్రాక్టర్ లోడుకు ఐదారు క్వింటాళ్ల కోతకు రైతులు అంగీకరిస్తేనే బస్తాలు దించుకుంటున్నారు. దీంతో ఇప్పటివరకు 1.64 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మరో నాలుగైదు రోజుల్లో అక్కడక్కడ మిగిలిపోయిన పంటను కోసి రైతులు అమ్మినా.. కొనుగోలు చేయగలిగే ధాన్యం 2.20 లక్షల మెట్రిక్ టన్నులకు మించే పరిస్థితి కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులుగాయలేక, తరుగు పేరిట క్వింటాళ్ల కొద్దీ వడ్లను తీయడంతో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసుకున్న రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, మిల్లర్లకు క్వింటాల్‌కు రూ.1700, రూ.1800 కే అమ్మేసుకుంటున్నారు. 

15 రోజుల దాటినా డబ్బులు రాలే

మాది ఇల్లందకుంట గ్రామం. పండించిన 60  క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ ద్వారా అమ్మి  శ్రీరాములపల్లిలోని ఓ మిల్లులో బస్తాలు దించాను. వడ్లు అమ్మి 15 రోజులు దాటినా ఇప్పటికీ నా అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు. పది రోజుల్లోనే ఇస్తామన్న అధికారులు ఇప్పటివరకు డబ్బులు అకౌంట్లో వేయడం లేదు. డబ్బులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. 

-  రావుల ఎల్లయ్య, ఇల్లందకుంట