Chiranjeevi : 'మీ విజిల్స్, చప్పట్లే నా శక్తి'.. 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi : 'మీ విజిల్స్, చప్పట్లే నా శక్తి'.. 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ తో చిరంజీవి ఫుల్ ఖుషిలో ఉన్నారు.  ఈ సందర్భంగా తన చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నా జీవితం మీ ప్రేమాభిమానాలతో..

"మన శంకరవరప్రసాద్ గారు" సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోయిందని మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్ లో పేర్కొన్నారు.  నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది.  ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది అని ఎమోషనల్ అయ్యారు.

 మీరు విజిల్స్, చప్పట్లే నా శక్తి..

వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి అని చిరంజీవి అన్నారు. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం అన్నారు. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు , సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

 

చిరంజీవి పోస్ట్ పై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. "మన శంకరవరప్రసాద్ గారు" మూవీ అనేది ప్రేక్షకులపై మీకున్న ప్రేమకు, మీపై వారికున్న శాశ్వతమైన ప్రేమకు ఒక వేడుక. తరతరాలుగా ఇంతటి ప్రేమతో ఆరాధించే మీచే ప్రశంసించబడటం నా జీవితంలోనే అతిపెద్ద బహుమతి. నన్ను నమ్మి ఈ సినిమాలో భాగం చేసినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరు, అనిల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.