తగ్గిన సర్కారు బ్యాంకుల ఎన్​పీఏలు

తగ్గిన సర్కారు బ్యాంకుల ఎన్​పీఏలు

న్యూఢిల్లీ: పబ్లిక్​ సెక్టార్​ యూనిట్​(పీఎస్​యూ) బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి.  వీటి గ్రాస్​ఎన్​పీఏలు 5.53 శాతానికి తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​–డిసెంబరు మధ్య పీఎస్​యూ  బ్యాంకులు రూ. 70,167 కోట్ల లాభం సంపాదించాయి. వీటి నెట్​ ఎన్​పీఏలు  2018 మార్చిలో 14.6 శాతం  నుంచి డిసెంబర్ 2022లో 5.53 శాతానికి తగ్గాయని సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.  2021-–22లో మొత్తం 66,543 కోట్ల రూపాయల రాబడితో అన్ని పీఎస్​బీలు లాభాల్లో ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఇది 70,167 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభకు తెలిపారు.  పీఎస్​బీల ప్రొవిజన్ కవరేజ్ రేషియో డిసెంబర్ 2022లో 46 శాతం నుంచి 89.9 శాతానికి పెరగడంతో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. పీఎస్​బీల మూలధన సమృద్ధి నిష్పత్తి మార్చి 2015లో 11.5 శాతం నుంచి 2022 డిసెంబర్  నాటికి14.5 శాతానికి మెరుగుపడింది.  

పీఎస్​బీల మొత్తం మార్కెట్ క్యాప్ (జనవరి 2019లో ప్రైవేట్ రంగ బ్యాంకుగా మారిన ఐడీబీఐ బ్యాంక్ మినహా) మార్చి 2018లో రూ. 4.52 లక్షల కోట్ల నుంచి డిసెంబర్ 2022 నాటికి రూ.10.63 లక్షల కోట్లకు పెరిగింది. గతంలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ పరిధిలోకి వెళ్లిన బ్యాంకులు కూడా ఆశించిన అభివృద్ధిని సాధించాయని కరాద్ చెప్పారు. ‘‘పీఎస్​బీల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. మొండిబాకీలను పారదర్శకంగా గుర్తిస్తున్నారు. పీఎస్​బీలను రీక్యాపిటలైజ్ చేశాం. గడచిన ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం ఎన్నో బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకొచ్చింది. దీనివల్ల క్రెడిట్ క్రమశిక్షణ పెరిగింది. బాధ్యతాయుతంగా అప్పులు ఇస్తున్నారు. మెరుగైన పాలన, కొత్త టెక్నాలజీలను వాడటం, బ్యాంకుల విలీనం వంటివి సాధ్యమయ్యాయి” అని వివరించారు. ఇదిలా ఉంటే   కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, మొత్తం 30.48 కోట్ల వెహికల్స్​లో (మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్  లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డేటా మినహా) 16.54 కోట్ల బండ్లకు బీమా లేదని కరద్​ఈ సందర్భంగా ప్రకటించారు. 

36 పీఎస్​యూల్లో  వాటాల అమ్మకానికి ఓకే

2016 నుంచి ప్రభుత్వం 36 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్​ఈలు) / అనుబంధ సంస్థలు/యూనిట్లు/ పీఎస్​ఈలు/బ్యాంకుల జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వాటాల అమ్మకానికి ప్రభుత్వం 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపిందని కరాద్​ వెల్లడించారు. మొత్తం 36 కేసుల్లో 33 కేసులను డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (దీపమ్) , 3 కేసులను సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ/డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. దీపమ్ చేపట్టిన 33 కేసులలో  పదింటిలో పెట్టుబడుల అమ్మకాలు పూర్తయ్యాయి. ఐదు పీఎస్​ఈలను మూసివేయాలన్న ప్రపోజల్  ​పరిశీలనలో ఉంది.  కోర్టు కేసు కారణంగా ఒక కేసును ఆపేశారు. మరో కేసు ఎన్​సీఎల్టీలో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఉందని ఆయన చెప్పారు. మిగిలిన లావాదేవీలు వివిధ దశలలో ఉన్నాయి.