కొనసాగనున్న వంటనూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు

కొనసాగనున్న వంటనూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు

న్యూఢిల్లీ :  ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో భాగంగా ముఖ్యమైన వంటనూనెల దిగుమతులపై సుంకాల తగ్గింపును 2025 మార్చి వరకు కొనసాగిస్తున్నట్టు కేంద్రం  ప్రకటించింది. సోయాబీన్,  పొద్దుతిరుగుడు నూనెలపై 17.5శాతం నుంచి 12.5శాతం వరకు సుంకం తగ్గింపు వల్ల దేశీయ మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది.  2024 మార్చిలో ముగియనున్న  డ్యూటీ తగ్గింపు మార్చి 2025 వరకు కొనసాగుతుంది. 

రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్,  రిఫైన్డ్ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్‌‌‌‌‌‌‌‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. ప్రాథమిక దిగుమతి సుంకం ధరలను ప్రభావితం చేస్తుంది.  దిగుమతి సుంకం తగ్గింపు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది దేశీయంగా రిటైల్ ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది. భారతదేశం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వంటనూనెల వినియోగదారు. 

నూనెలను దిగుమతి చేసుకోవడంలో మనదేశం మొదటిస్థానంలో ఉంది. మన అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దిగుమతుల్లో  ఎక్కువ భాగం పామాయిల్  ఇండోనేషియా,  మలేషియా నుంచి వస్తాయి. ఆవాలు, తాటి, సోయాబీన్,  పొద్దుతిరుగుడు నుంచి మనదేశంలో నూనెలను తీస్తారు.