ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్ల నమోదు : బి.రాహుల్

ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్ల నమోదు : బి.రాహుల్

మంచిర్యాల,వెలుగు:  ఈ పుల 15 వరకు కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అడిషనల్​ కలెక్టర్​(లోకల్​బాడీస్​) బి.రాహుల్ చెప్పారు. అర్హత ఉండి ఓటరుగా నమోదుకాని వాళ్లను గుర్తించి నమోదు చేయించాలని ఆఫీసర్లకు సూచించారు. గురువారం జిల్లా లోని కలెక్టర్ ఆఫీసులో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతీలాల్ తో  కలిసి స్వీప్ కోర్ కమిటీ ప్రతినిధులతో సమీక్ష  నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్​ మాట్లాడుతూ ఈ నెల 15  వరకు కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఉంటుందని,  స్కూళ్లు ,కాలేజీలలో 348 మంది క్యాంపస్ అంబాసిడర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని సక్సెస్​ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఎన్నికల్లో  పోలింగ్ శాతం పెంచేలా జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  ఓటు హక్కు వినియోగంపై సెక్స్ వర్కర్లు, ట్రాన్స్​జెండర్లు, కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. 

కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి. కిషన్, డీపీఓ .వెంకటేశ్వర రావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శైలజ, డీఈఓ ఎన్.యాదయ్య, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. సుబ్బారాయుడు, జిల్లా సంక్షేమాధికారి కె. చిన్నయ్య, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి, ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.