రేఖా నాయక్ ​అవినీతిపై విచారణ జరపాలి - షర్మిల

రేఖా నాయక్ ​అవినీతిపై విచారణ జరపాలి - షర్మిల

ఖానాపూర్ : ఎమ్మెల్యేల కొనుగోళ్లు, డబ్బులు, మద్యం పంపిణీ లాంటి అక్రమాలతో మునుగోడులో గెలుపు కోసం ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను అక్కడి ఓటర్లు బహిష్కరించాలని వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ఆమె మాట్లాడారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసిందని, టీఆర్​ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్​లోనే ఈ తతంగం నడిపించినట్లు ఆరోపణలు చేసుకుంటున్నారని, ఇదంతా ఓ డ్రామా లా కనిపిస్తున్నదని విమర్శించారు. ఈ అంశాన్ని రెండు పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. 100 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారని ఆ పార్టీ ఆరోపిస్తుండగా, తమ ప్రమేయం లేదని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు. ఎఫ్ఐఆర్ లో బీజేపీ నేతల పేర్లు పెట్టారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం లేదు

ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖా నాయక్ అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. అన్ని వ్యవహారాల్లో ఎమ్మెల్యే కమీషన్​ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. చివరికి గుడిలో కొబ్బరికాయ కొట్టాలన్న కమీషన్​ కావాలట కదా.. అని ఆమె అక్కడి వాళ్లను ప్రశ్నించారు. సబ్సిడీ కింద 2 రైస్ మిల్లులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. తన సొంత  కాలేజీలకు నష్టం జరుగుతుందన్న భావనతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం లేదన్నారు.

మీ ఎమ్మెల్యేలు నిజాయితీపరులైతే..సీబీఐ దర్యాప్తు చేయించండి
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్​కు వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ‘మీ ఎమ్మెల్యేలు నిర్దోషులైతే, మీకు అంత నమ్మకమే ఉంటే, మీ ఎమ్మెల్యేలు, మీరు నిజాయితీ పరులైతే వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అని ఆమె ట్వీట్​ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మాలనుకున్నది ఎవరో, కొనాలనున్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ‘మౌనం అర్ధాంగీకారం చిన్నదొర.. మీరు సీబీఐ ఎంక్వైరీ వేయకుంటే తప్పు అంగీకరించినట్టే’ అంటూ   ట్వీట్​ చేశారు.