సెస్ ఎన్నికల ముంగిట రైతుబంధు రిలీజ్

సెస్ ఎన్నికల ముంగిట  రైతుబంధు రిలీజ్
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో  లక్షా 26 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.131 కోట్లు
  • రాష్ట్రమంతా ఈ నెల 28 నుంచి ఇస్తామన్న సర్కారు
  • ఎన్నికలు జరిగే జిల్లాలో మాత్రం వారం ముందే డబ్బులు
  • ఎన్నికలు జరిగే జిల్లాలో మాత్రం వారం ముందే డబ్బులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు మాత్రం గురువారమే రిలీజ్ చేసింది. సుమారు లక్షా 26వేల మంది రైతుల ఖాతాల్లో రూ.131కోట్లు వేసింది. జిల్లాలో ఈ నెల 24న సెస్ (సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్నోళ్లలో ఎక్కువమంది రైతులే కావడంతో వారిని ప్రభావితం చేసేందుకే ముందస్తు రైతుబంధు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

ఓటర్లలో సగానికి పైగా రైతులే

ఈ నెల 24న జరగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 87,130 మంది సెస్ సభ్యులలో సగానికి పైగా రైతులే ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసి ఎన్నికలకు రెండు రోజుల ముందే రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు జమచేయించింది. సిరిసిల్ల జిల్లాలో లక్షా 26వేల మంది రైతుల ఖాతాల్లో గురువారం రూ.131కోట్ల రైతు బంధు డబ్బులు పడ్డాయి. బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేయించుకునేందుకే ప్రభుత్వం ఇలా ఎన్నికల ముందు రైతుబంధు వేసిందని ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు. 
అన్ని పార్టీలు ఫోకస్ 
కోట్లలో లావాదేవీలు జరిగే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్​ పెట్టాయి. 15 డైరెక్టర్ స్థానాలను గెలచుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ నుంచే అసమ్మతి నేతలతో మాట్లాడి రెబెల్స్ బరిలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు రోజుల కింద సిరిసిల్లలో డైరెక్టర్ కేండిడేట్లు, పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు. బరిలో ఉన్న ఇండిపెండెంట్ల నుంచి ఇబ్బంది కలుగకుండా జాగ్రత పడాలని సూచించారు. బీజేపీ కూడా ఈసారి సెస్​లో పాగా పేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల టౌన్ వన్, వేములవాడ రూరల్, వేములవాడ టౌన్ వన్, వేములవాడ టౌన్ టూ, సిరిసిసిల్ల టౌన్, చందుర్తి డివిజన్ లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు సెస్​ డైరెక్టర్ల తరఫున ప్రచారం చేశారు. ఆయా మండలాలకు పార్టీ సీనియర్ నాయకులను ఇన్ చార్జీలుగా నియమించారు. ఎల్లారెడ్డిపేటకు కూనం శ్రీశైలం గౌడ్, సిరిసిల్ల టౌన్ 1 లో  రాణి రుద్రమ,  టూ లో వీరేంద్ర గౌడ్ ఇంటింటికీ వెళ్లిప్రచారం చేస్తున్నారు.  పార్టీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

సెస్​ ఎన్నికల కోసమే రైతుబంధు

ఈ నెల 28 నుంచి రాష్ట్రమంతా రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో మాత్రమే ముందస్తుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. సెస్ ఓటర్లలో ఎక్కువమంది రైతులే ఉండడంతో వాళ్లను మభ్యపెట్టేందుకు ప్లాన్ ప్రకారం చేసిన ప్రయత్నమిది. రూలింగ్​పార్టీకి ఇలాంటివి కొత్తకాదు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లోనూ ఇలాగే చేసింది.

- ప్రతాప రామకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు