
రజినీకాంత్ సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో, తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంటుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమాపై కూడా చక్కని అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. పలువురు తమిళ నటీనటులతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్ నుండి నాగబాబు, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా ఇందులో నటిస్తున్నారు. వీడియోతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.
ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిగ్గా అదే సమయానికి చిరంజీవి చిత్రం ‘భోళా శంకర్’ రిలీజ్ కాబోతోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుందని కొద్ది నెలల క్రితమే ప్రకటించారు. వీకెండ్‌తో పాటు పంద్రాగస్టు కలిసొచ్చేలా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ప్లాన్ చేశారు. దీంతో ఇటు మెగాస్టార్, అటు సూపర్ స్టార్ సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మంచి స్నేహం ఉంది. మరి బాక్సాఫీస్ వార్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!