ఐఎస్‌‌ఎంసీలో వాటా కొనేందుకు రిలయన్స్, హెచ్‌సీఎల్ ప్రయత్నాలు

ఐఎస్‌‌ఎంసీలో వాటా కొనేందుకు రిలయన్స్, హెచ్‌సీఎల్ ప్రయత్నాలు

న్యూఢిల్లీ: సెమికండక్టర్ల బిజినెస్‌‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, హెచ్‌‌సీఎల్ టెక్ కంపెనీలు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి. చిప్‌‌ల తయారీ కంపెనీ ఐఎస్‌‌ఎంసీ ఎనలాగ్‌‌లో 30 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయడానికి ఇరు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్ కంపెనీలు తమ సబ్సిడరీల ద్వారా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సెమికండక్టర్ల బిజినెస్‌‌ కోసం  రెండు కంపెనీలు కలిసి  సుమారు రూ.4 వేల కోట్లు ( 500–600 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయొచ్చని అంచనా. ముంబైకి చెందిన నెక్స్ట్‌‌ ఆర్బిట్ వెంచర్స్‌‌, ఇజ్రాయిల్‌‌ టెక్ కంపెనీ టవర్ సెమికండక్టర్‌‌‌‌ కలిసి ఐఎస్‌‌ఎంసీ ఎనలాగ్‌‌ను ఏర్పాటు చేశాయి.  దేశాన్ని సెమికండక్టర్ల హబ్‌‌గా మార్చేందుకు  చిప్‌‌ల తయారీలో పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ స్కీమ్‌‌ కింద రూ. 76,000 కోట్ల రాయితీలను  ప్రకటించింది.  ఈ స్కీమ్‌‌కు ఐఎస్‌‌ఎంసీ అప్లయ్ చేసుకుంది.  కర్నాటకలోని మైసూరుకి దగ్గరలో ఒక ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌‌‌‌లో రూ.25 వేల కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో చిప్‌‌ల తయారీ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. 65 నానో మీటర్ల సైజులోని చిప్‌‌లను ఐఎస్‌‌ఎంసీ తయారు చేయనుంది. వీటిని వివిధ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులలో, వెహికల్స్‌‌లలో వాడుతున్నారు.  మార్కెట్‌‌లోని అవకాశాలను పరిశీలిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పోక్స్‌‌ పర్సన్‌‌ పేర్కొన్నారు. కానీ, ఐఎస్‌‌ఎంసీలో  30 శాతం వాటాను కొనుగోలు చేయడంపై స్పందించలేదు.  హెచ్‌‌సీఎల్‌‌ టెక్ కూడా రెస్పాండ్ కాలేదు. ఇన్వెస్టర్ల పేర్లను బయటపెట్టమని ఐఎస్‌‌ఎంసీ పేర్కొంది. కాగా, ఐఎస్‌‌ఎంసీ తమ బోర్డును విస్తరిస్తోంది.  కొత్త ఇన్వెస్టర్లను బోర్డులోకి తెచ్చేందుకు నామినీ డైరెక్టర్ పోస్టులను క్రియేట్ చేసింది. ఐఎస్ఎంసీలో టవర్ సెమికండక్టర్స్‌‌ తమ 15 శాతం వాటాను హోల్డ్ చేస్తుందని సంబంధిత వ్యక్తులు వివరించారు. దీని బట్టి నెక్స్ట్ ఆర్బిట్ తన వాటాలను అమ్మే అవకాశం ఉంది. హెచ్‌‌సీఎల్‌‌ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీలు ఐఎస్‌‌ఎంసీతో టర్మ్‌‌ షీట్‌‌పై సంతకాలు చేశాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు అన్నారు. 

వేదాంత తర్వాత రెండు పెద్ద కంపెనీలు..

ఒక వేళ ఈ డీల్స్ పూర్తయితే  వేదాంత తర్వాత సెమికండక్టర్ల బిజినెస్‌‌లోకి ఎంటర్ అయిన పెద్ద కార్పొరేట్‌‌లగా రిలయన్స్, హెచ్‌‌సీఎల్ నిలుస్తాయి. లోకల్‌‌గానే సెమికండక్టర్ల సప్లయ్‌‌ చెయిన్ ఉండేలా చేయడానికి రిలయన్స్ ఈ బిజినెస్‌‌లోకి ఎంటర్ అవుతోందని  ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.   డిజైన్‌‌ నుంచి చిప్‌‌ల తయారీ, అసెంబుల్ చేయడం, ఈఎంఎస్ మాన్యుఫాక్చరింగ్‌‌..ఇలా మొత్తం సప్లయ్ చెయిన్ లోకల్‌‌గానే జరుగుతుందన్నారు. గూగుల్‌‌తో కలిసి  ఫీచర్‌‌‌‌, స్మార్ట్‌‌ఫోన్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది. హెచ్‌‌సీఎల్‌‌కు మాత్రం ఐఎస్‌‌ఎంసీలో వాటాలు కొనడం అతి పెద్ద అక్విజేషన్‌‌గా నిలుస్తుంది. ఈ డీల్‌‌తో ప్రపంచ వ్యాప్తంగా ఇంజినీరింగ్ , ఆర్‌‌‌‌& డీ సర్వీస్‌‌లను అందించడానికి ఈ కంపెనీకి మరింతగా వీలుంటుంది. ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే  సెమికండక్టర్ల డిజైన్‌‌, ఇంజీనిరింగ్ సర్వీస్‌‌లను గ్లోబల్‌‌గా ఆఫర్ చేస్తోంది.  దేశ సెమికండక్టర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌ చేయడంపై  ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని, లోకల్ చిప్ మార్కెట్‌‌ ఏడాదికి 16–18 %  గ్రోత్ సాధిస్తుండడమే ఇందుకు కారణమని ఎనలిస్టులు పేర్కొన్నారు.