27శాతం పెరిగిన రిలయన్స్​ లాభం

27శాతం పెరిగిన రిలయన్స్​ లాభం
  • రెండో క్వార్టర్​లో రూ.19,878 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.2,55,996 కోట్లు
  • 30 శాతం పెరిగిన ఇబిటా

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌‌ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.19,878 కోట్ల (కన్సాలిడేటెడ్​) నికర లాభం సంపాదించింది. వార్షికంగా ఇది 29.7 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ.13,656 కోట్లు వచ్చాయి. ఇబిటా 30.2 శాతం వృద్ధితో రూ.44,867 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్ 390 బేసిస్​ పాయింట్లు పెరగడంతో17.5 శాతానికి ఎగిసింది. మొత్తం ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్​కు ఎనర్జీ, పెట్రోకెమికల్స్, రిటైల్  టెలికమ్యూనికేషన్స్‌‌తో సహా వివిధ వ్యాపారాలు ఉన్నాయి. కంపెనీ చైర్మన్​ ముకేశ్​ అంబానీ వారసులు ఈశా, అనంత్​లను నాన్​–ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లుగా నియమిస్తూ చేసిన ప్రపోజల్​కు ఇన్వెస్టర్లు గ్రీన్ ​సిగ్నల్ ​ఇచ్చారు. ముకేశ్​ భార్య నీతా అంబానీ బోర్డు డైరెక్టర్​గా తప్పుకున్నారు. ఈశా అంబానీ రిలయన్స్​ రిటైల్​ బాధ్యతలను, అనంత్​ అంబానీ న్యూ ఎనర్జీ బాధ్యతలను తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు వర్టికల్స్​ ఫలితాలు ఇలా ఉన్నాయి:

జియో ప్లాట్‌‌ఫారమ్‌‌లు

మొబిలిటీ  వైర్‌‌లైన్ సేవలలో సబ్‌‌స్క్రయిబర్లు బాగా పెరగడం,  డిజిటల్ సేవల ప్లాట్‌‌ఫారమ్ వృద్ధి కారణంగా జియో ప్లాట్‌‌ఫారమ్‌‌ల ఏకీకృత రాబడి, ఇబిటా పెరిగింది. సెగ్మెంట్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం తాజా క్వార్టర్​లో 10.7 శాతం పెరిగి రూ.26,875 కోట్లకు చేరుకుంది. నికర లాభం  రూ.5,297 కోట్లకు పెరిగింది. క్వార్టర్​లో ఇబిటా సంవత్సరానికి 12.6 శాతం పెరిగి రూ.13,528 కోట్లకు చేరుకుంది.  ఇబిటా మార్జిన్ 80 బేసిస్​ పాయింట్లు పెరిగి 50.3 శాతానికి చేరింది. జియో టెలికం ఈ మూడు నెలల్లో 1.11 కోట్ల మంది  కస్టమర్లను  సంపాదించింది.   

రిలయన్స్ రిటైల్ వెంచర్స్

సెగ్మెంట్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం తాజా క్వార్టర్​లో 19.5 శాతం పెరిగి రూ.68,937 కోట్లకు చేరుకోగా, నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఇబిటా 32.2 శాతం వార్షిక వృద్ధితో రూ.5,820 కోట్లకు చేరుకోగా, ఇబిటా మార్జిన్ 80 బేసిస్​ పాయింట్లు పెరిగి  8.4 శాతానికి చేరుకుంది. ఈ క్వార్టర్​లో 471 కొత్త స్టోర్లను ఓపెన్​ చేశారు.   మొత్తం ఆదాయంలో డిజిటల్ కామర్స్,  న్యూ కామర్స్ వ్యాపారాల నుంచి వాటా19 శాతం ఉంది. ఫ్యాషన్, లైఫ్‌‌స్టైల్ వ్యాపారం 32 శాతం వార్షిక వృద్ధిని అందించింది.    

ఆయిల్-టూ కెమికల్స్ (ఓటూసీ)

 ముడి చమురు ధరలలో 14 శాతం తగ్గుదల కారణంగా ఓటూసీ సెగ్మెంట్ ఆదాయం 7.3 శాతం తగ్గి రూ.1,47,988 కోట్లకు పడిపోయింది. ఉత్పత్తులకు తక్కువ ధర లభించడం కూడా ప్రభావం చూపించింది. సెగ్మెంట్  ఇబిటా 36 శాతం  పెరిగి రూ.16,281 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్ 350 బేసిస్​ పాయింట్లు ఎగిసి 11 శాతానికి పెరిగింది.

ఆయిల్​, గ్యాస్​

ఎంజే ఫీల్డ్​ నుంచి గ్యాస్,  చమురు ఉత్పత్తి మొదలుకావడంతోపాటు కేజీ డీ6లో ఉత్పత్తి ఆరు శాతం పెరగడం వల్ల సెగ్మెంట్ ఆదాయం 71.8 శాతం పెరిగి రూ.6,620 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఇబిటా సంవత్సరానికి 50.3 శాతం పెరిగి రూ.4,766 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్ 1,030 బేసిస్​ పాయింట్లు తగ్గి 72 శాతానికి చేరుకుంది. తపతి ఫీల్డ్‌‌లో ఎంజీ ఫీల్డ్  డీకమిషన్ కార్యకలాపాలకు సంబంధించిన అధిక ఖర్చుల కారణంగా ఈ క్వార్టర్​లో మార్జిన్లు తగ్గాయని రిలయన్స్​ తెలిపింది.  

మీడియా వ్యాపారం

 కార్యకలాపాల ద్వారా ఆదాయం వార్షికంగా 20.4 శాతం పెరిగి రూ.1,865 కోట్లకు చేరింది. అయితే ఈ క్వార్టర్​లో ఈ విభాగం రూ.111 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది రెండో క్వార్టర్​లో సెగ్మెంట్  నష్టం రూ.29 కోట్లు ఉంది. సెగ్మెంట్ ఇబిటా 186.1 శాతం పడిపోయింది. ఇబిటా మార్జిన్ 400 బేసిస్​ పాయింట్లు తగ్గింది. ఆటలు,  డిజిటల్‌‌లో పెట్టుబడులు పెట్టడంతో ఇబిటా తగ్గిందని రిలయన్స్​ తెలిపింది.