రిలయన్స్​ లాభం .. రూ.16,011 కోట్లు

రిలయన్స్​ లాభం ..  రూ.16,011 కోట్లు

న్యూఢిల్లీ:  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌ఐఎల్) కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో వార్షికంగా 11 శాతం తగ్గి రూ.16,011 కోట్లకు పడిపోయింది.  ఆదాయం 5.3 శాతం తగ్గి రూ. 2.11 లక్షల కోట్లకు చేరుకుంది. షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి రూ. 9 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది.   ఆయిల్ -టు -కెమికల్స్ (ఓ2సీ) వ్యాపారం  బలహీనంగా ఉండటంతో ఆదాయం తగ్గింది. ఈ విభాగం నుంచి వచ్చే ఆదాయం దాదాపు 18శాతం తగ్గి రూ. 1.33 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.  రిటైల్,  డిజిటల్ సేవల వ్యాపారాలలో రెండంకెల వృద్ధి కారణంగా లాభం మరీ ఎక్కువగా తగ్గలేదు. రిటైల్ సెగ్మెంట్ ఆదాయం సంవత్సరానికి 20 శాతం పెరిగి రూ.69,962 కోట్లకు చేరుకుంది.  

డిజిటల్ సేవల ఆదాయం దాదాపు 13శాతం వృద్ధితో రూ.32,077 కోట్లకు చేరుకుంది. ఓ2సీ వ్యాపారంలో బలహీనత ఉన్నప్పటికీ,  నిర్వహణ లాభం 5శాతం పెరిగి రూ. 41,982 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్​లో మూలధన వ్యయం రూ. 39,645 కోట్లు కాగా, మార్చి క్వార్టర్​లో ఇది  రూ. 44,413 కోట్లు. ఈ ఏడాది  జూన్ 30 నాటికి కంపెనీ అప్పులు రూ. 3.19 లక్షల కోట్లు కాగా, క్వార్టర్​ క్రితం ఇవి రూ. 3.14 లక్షల కోట్లు. జూన్ చివరి నాటికి క్యాష్‌, క్యాష్​ ఈక్వలంట్స్‌ విలువను రూ. 1.92 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇది క్వార్టర్​ క్రితం రూ. 1.88 లక్షల కోట్లుగా ఉంది.   అధిక వడ్డీ రేట్లు, లోన్​ బ్యాలెన్స్‌‌ల కారణంగా వడ్డీ భారం 46 శాతం పెరిగి రూ. 5,837 కోట్లకు చేరుకుంది.   

ఓ2సీ వ్యాపారం

ఆయిల్​ టూ కెమికల్స్ (ఓ2సీ) వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 18 శాతం తగ్గి రూ. 1.33 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్‌ క్వార్టర్​లో ఈ వ్యాపారం ​ ఆదాయం రిలయన్స్ మొత్తం ఆదాయంలో 63 శాతంగా ఉంది.  తక్కువ మార్జిన్ల కారణంగా క్వార్టర్​లో ఇబిటా వార్షికంగా 23.2శాతం  తగ్గి రూ. 15,271 కోట్లకు చేరుకుంది. క్వార్టర్​లో మొత్తం ఉత్పత్తి 19.7 మిలియన్ టన్నులు కాగా, అంతకుముందు క్వార్టర్​లో ఇది 19.8 మిలియన్ టన్నులు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆదాయం దాదాపు 20 శాతం పెరిగి రూ.69,948 కోట్లకు చేరుకుంది.  ఇబిటా 34 శాతం వార్షికంగా పెరిగి రూ. 5,139 కోట్లకు చేరుకుంది.  ఒక క్వార్టర్​లో ఎన్నడూ లేనంత అత్యధిక లాభం ఇది! శుక్రవారం సెషన్‌‌లో ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌‌ఐఎల్ షేర్లు 3.5  శాతం వరకు పడ్డాయి.

జియో లాభం రూ.4,863 కోట్లు

 - రిలయన్స్ జియో  లాభం  ఏడాది ప్రాతిపదికన 12 శాతం (వార్షికంగా) వృద్ధిని నమోదు చేసి రూ. 4,863 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 10 శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది.  ఈ క్వార్టర్​లో మొత్తం ఖర్చులు ఏడాది క్రితం 16,136 కోట్ల నుంచి రూ.17,594 కోట్లకు పెరిగాయి. నెట్‌వర్క్  నిర్వహణ ఖర్చులు, మొత్తం వ్యయంలో  ఏడాది క్రితం రూ.6,842 కోట్ల నుంచి రూ.7.379 కోట్లకు పెరిగాయి. ఈ క్వార్టర్​లో  లైసెన్స్  ఫీజు/స్పెక్ట్రమ్ ఛార్జీలు రూ.2,204 కోట్లుగా ఉన్నాయి. ఇవి ఏడాది క్రితం రూ.2,536 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఖర్చులు సీక్వెన్షియల్​గా రూ.1,006 కోట్ల నుంచి రూ.971 కోట్లకు తగ్గాయి. వాయిదా వేసిన పన్ను (డిఫర్డ్ ​ట్యాక్స్) ఏడాది క్రితం రూ.1,483 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్​లో  రూ.1,670 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్ మార్జిన్   సీక్వెన్షియల్​, వార్షికంగా 26.2శాతం వద్ద ఫ్లాట్‌గా ఉంది.