
- మొత్తం సబ్‌స్క్రయిబర్ల బేస్ 46.97 కోట్లు
- మరో 5.41 లక్షల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో భారత టెలికాం మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని బలపరుచుకుంది. ఈ ఏడాది మార్చిలో 21.74 లక్షల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రయిబర్లను సంపాదించింది. భారతి ఎయిర్‌టెల్ 12.50 లక్షల మంది కొత్త యూజర్లను చేర్చుకుందని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ బుధవారం పేర్కొంది. వొడాఫోన్ ఐడియా 5.41 లక్షల మంది మొబైల్ యూజర్లను కోల్పోయింది. దీంతో ఈ కంపెనీ సబ్‌స్క్రయిబర్ బేస్ 20.53 కోట్లకు తగ్గింది.
ట్రాయ్ డేటా ప్రకారం, జియో ఈ ఏడాది మార్చిలో 21.74 లక్షల వైర్‌లెస్ యూజర్లను జోడించడంతో దాని సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్ మొబైల్ బేస్ 38.98 కోట్లకు పెరిగింది. "మొత్తం వైర్‌లెస్ (మొబైల్+5జీ-ఎఫ్‌డబ్ల్యూఏ) సబ్‌స్క్రయిబర్లు ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో 116.03 కోట్లు ఉంటే మార్చి చివరి నాటికి 116.37 కోట్లకు పెరిగారు. ఇది 0.28 శాతం నెలవారీ గ్రోత్‌కు సమానం. అర్బన్ ఏరియాల్లో వైర్‌లెస్ సబ్‌స్క్రిప్షన్ ఈ ఏడాది ఫిబ్రవరిలోని 63.40 కోట్ల నుంచి మార్చి-లో 63.25 కోట్లకు తగ్గగా, రూరల్ ఏరియాల్లో 52.63 కోట్ల నుంచి 53.12 కోట్లకు పెరిగింది" అని ట్రాయ్ తన నెలవారీ సబ్‌స్క్రయిబర్ డేటా రిపోర్ట్‌లో తెలిపింది.
అర్బన్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు 0.26 శాతం తగ్గగా, రూరల్ వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య 0.92 శాతం పెరిగింది. "వైర్‌లైన్ (బ్రాడ్‌బ్యాండ్) సబ్‌స్క్రయిబర్లు ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో 3.69 కోట్ల నుంచి మార్చి చివరి నాటికి 3.70 కోట్లకు పెరిగారు" అని ట్రాయ్ తెలిపింది. నెలవారీ గ్రోత్ రేట్ 0.37 శాతంగా ఉంది.