
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ను మంగళవారం లాంఛ్ చేసింది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ పేరుతో ఈ ప్లాన్ లను తీసుకొచ్చింది. నెల టారిఫ్ రూ. 399 నుంచి 1,499 రేంజ్ లో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి . ఈ సర్వీస్ లను ఎంచుకున్నవారికి నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ లను ఫ్రీగా జియో అందిస్తోంది. దీంతో పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో టారిఫ్ వార్ మొదలయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను లాంఛ్ చేయడానికి ఇంతకంటే గొప్ప సమయం ఉండదని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరిలో 40 కోట్ల కస్టమర్ల నమ్మకాన్ని ఇప్పటికే సంపాదించామని చెప్పారు. తమ కస్టమర్ల బేస్ పోస్ట్‌పెయిడ్ కేటగిరీలో విస్తరించాలని అనుకుంటున్నామని అన్నారు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ఈ నెల 24 నుంచి జియో స్టోర్లలో, హోమ్ డెలివరీకి అందుబాటులోకి వస్తుంది.