సోలార్​ పానెల్స్​ తయారీలోకి రిలయన్స్​, టాటా

సోలార్​ పానెల్స్​ తయారీలోకి రిలయన్స్​, టాటా

95 గిగావాట్ల కెపాసిటీ టార్గెట్​

న్యూఢిల్లీ: సోలార్​ పానెల్స్​ తయారీని దేశంలో పెంపొందించడానికి ఉద్దేశించిన రూ. 19,500 కోట్ల ఇన్సెంటివ్స్​దక్కించుకోవడానికి రిలయన్స్​ఇండస్ట్రీస్​, టాటా పవర్​లు రంగంలోకి దిగాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇన్సెంటివ్స్​ను ప్రకటించింది. సోలార్​ పానెల్స్​ ఎక్కువగా దిగుమతి అవుతున్నది చైనా నుంచే. ఫస్ట్​ సోలార్​ లాంటి ఇంటర్నేషనల్​ కంపెనీలు సైతం మన ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్​ అందుకోవడానికి రెడీ అవుతున్నాయి. జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ, అవాడా గ్రూప్, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ కంపెనీలు కూడా ఆసక్తితో ఉన్నట్లు బ్లూమ్​బర్గ్​ ఒక కథనాన్ని పబ్లిష్​ చేసింది. ఇండియాలోని సోలార్​ పానెల్స్​ తయారీదారులలో పెద్దదైన అదానీ గ్రూప్​ మాత్రం ఈ బిడ్స్​లో భాగం పంచుకోలేదని పేర్కొంది. ఇండియాను మాన్యుఫాక్చరింగ్​ హౌస్​గా మార్చే క్రమంలో ఈ ఫైనాన్షియల్​ ఇన్సెంటివ్స్​ను ఇవ్వాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎకానమీలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడంతోపాటు, దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా విలువైన ఫారెక్స్​ను ఆదా చేయడంపైనా ప్రభుత్వం ఫోకస్​ పెడుతోంది.

చైనా దిగుమతులు వద్దనే.....

మాన్యుఫాక్చరింగ్​లో చైనాకు ఆల్టర్నేటివ్​గా ఇండియాను గ్లోబల్​గా షోకేస్​ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ఇటీవల ముమ్మరం చేసింది. కొవిడ్​మహమ్మారి రాకతో సప్లయ్​ చెయిన్స్​లో వచ్చిన అంతరాయాల వల్ల చాలా దేశాలు ఇబ్బందులపాలయ్యాయి. దీంతో ఒకే చోట తయారీపై ఎక్కువగా ఆధారపడకూడదని  గ్లోబల్​ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి కంపెనీలను ఇండియాకు రప్పించాలనేది మన ప్రభుత్వ ప్రయత్నం. సోలార్​ పానెల్​ మాడ్యూల్స్​ తయారీకి గ్రాంట్స్​ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దేశంలోని సోలార్​ పానెల్ మాడ్యూల్స్​ తయారీ కెపాసిటీని 90 గిగావాట్లకు చేర్చాలని గవర్నమెంట్​ టార్గెట్​  పెట్టుకుంది. ఈ కెపాసిటీ దేశ అవసరాలకు సరిపోవడమే కాకుండా, ఇతర దేశాలకు  ఎగుమతులు చేయడానికీ సరిపోతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో అమలవుతున్న రెన్యువబుల్​ ప్రాజెక్టులు గత కొంత కాలంగా స్లోగా నడుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులు నెమ్మదిస్తే రెన్యువబుల్ ఎనర్జీ టార్గెట్లను అందుకోవడం మన దేశానికి కష్టమవుతుంది. దీంతో, సోలార్​ మాడ్యూల్స్​ దిగుమతులను తాత్కాలికంగా అనుమతించాలని  చూస్తున్నట్లు కిందటి నెలలోనే కేంద్ర ఎలక్ట్రిసిటీ మంత్రి రాజ్​ కుమార్​ సింగ్​ వెల్లడించారు. దేశంలోని ప్రాజెక్టులను చురుగ్గా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రపోజల్​ను పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.

టార్గెట్​ రూ. 94 వేల కోట్ల పెట్టుబడులు...

చాలా రంగాలలో సొంత కాళ్లపై నిలబడేలా ప్రొడక్షన్​ చేపట్టాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్స్​ (పీఎల్​ఐ) స్కీమును కేంద్ర ప్రభుత్వం కిందటేడాది తెచ్చింది. ఈ స్కీము కిందే సోలార్​ మాడ్యూల్స్​ మాన్యుఫాక్చరింగ్​ కోసం రూ. 19,500 కోట్ల ఇన్సెంటివ్స్​ ఆఫర్​ చేస్తూ బిడ్లను పిలిచారు. సోలార్​ మాడ్యూల్స్​ మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్లో రూ. 94 వేల కోట్ల పెట్టుబడులు తేవాలనే టార్గెట్​ను కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.