చంద్రుడు పుట్టింది ఎలాగో తెలుసా?

చంద్రుడు పుట్టింది ఎలాగో తెలుసా?

మనకు ఆకాశంలో అందంగా కనిపించే చందమామ.. భూమికి ఉపగ్రహం. విశ్వం పరిణామ క్రమంలో ఇది సహజంగా ఏర్పడింది. అయితే సహజంగా అంటే అక్కడికక్కడ ఏదో పుట్టుకొచ్చేయలేదు. రెండు గ్రహాలు ఒక దానిని మరొకటి వేల  కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే, ఆ స్పీడ్లో బయటకొచ్చిన మరో బై ప్రొడక్ట్ చంద్రుడు అని సైంటిస్టులు తేల్చారు. భూమి కోర్ ఏరియాకు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడించారు.

అనంత విశ్వంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి కొన్ని నక్షత్రాలు ఉన్న ఒక సముదాయం పాలపుంత. ఆ పాలపుంతలోని ఒక నక్షత్రం సూర్యుడు. ఈ సౌర వ్యవస్థలో ఉన్న తొమ్మిది గ్రహాల్లో మనం ఉంటున్న భూమి ఒకటి. ఈ నక్షత్రాలు, గ్రహాలపై ఖగోళ శాస్త్రవేత్తలు చేస్తున్న రీసెర్చ్లలో ఎప్పటికప్పుడు కొత్త, ఆసక్తికర విషయాలు తెలుస్తుంటాయి. అలాంటిదే లేటెస్ట్గా అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎస్యూ) పరిశోధకుల అధ్యయనంలో భూమి, చంద్రుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ బయటపడ్డాయి. ఆ వివరాలపై ఇటీవలే వర్చువల్గా జరిగిన లూనార్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్లో సైంటిస్టులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

భూమి కోర్ దగ్గర మరో లేయర్ : భూమి లోపలి పొరలపై ఏఎస్యూ సైంటిస్టులు టీమ్ కొన్నేండ్లుగా పరిశోధనలు చేస్తోంది. నేల పైపొర నుంచి దాదాపు 6 వేల కిలోమీటర్ల లోతుకు వెళ్తే  సాలిడ్ ఐరన్, నికెల్తో భూమి కేంద్ర భాగం ఉంటుంది. దీనిని ఎర్త్ కోర్ అంటారు. ఈ కోర్ చుట్టూ సైంటిస్టులు కొత్తగా ఇంతవరకు తెలియని ఒక లేయర్ను గుర్తించారు. ఇది ఒక షేప్ అంటూ లేకుండా ముద్దలుగా అక్కడక్కడా పేరుకుపోయి ఉంది. ఈ మెటీరియల్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ ముద్దలు భూమి కోర్ కంటే ఎక్కువ డెన్సిటీతో ఉన్నాయని గుర్తించారు. ఇవి ఏం చిన్న సైజులో లేవని, వందల కిలోమీటర్ల ఎత్తు, వెడల్పు ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఈ ముద్దలకు లార్జ్ లోషియర్ వెలాసిటీ ప్రావిన్సెస్(ఎల్ఎల్ఎస్వీపీ) గా వారు పేర్కొన్నారు.

మాయమైన మరో గ్రహం ఆనవాళ్లవి : భూమి కోర్ ఏరియా చుట్టూ అక్కడక్కడా పేరుకుని ఉన్న కొత్త లేయర్ మన సౌర వ్యవస్థలో మాయమైపోయిన మరో గ్రహం ఆనవాళ్లని ఏఎస్యూ సైంటిస్టులు అంచనావేశారు. వాస్తవానికి ఖగోళంలో కొన్ని కోట్ల ఏండ్లపాటు పెద్ద పెద్ద శకలాలు, రాళ్లు గందరగోళంగా తిరుగుతూ, అనేక కొలిజన్స్ తర్వాత గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. అలా విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో మార్స్ సైజులో ఉండే మరో గ్రహం సౌర వ్యవస్థలో ఉండేదని, ఈ గ్రహానికి రీసెర్చ్ రెఫరెన్స్లో భాగంగా ‘థియా’ అని పేరు పెట్టామని సైంటిస్టుల టీమ్లో ఒకరైన క్వియాన్ యువాన్ తెలిపారు. ఈ గ్రహం కొన్ని వందల కోట్ల ఏండ్ల క్రితం పరిభ్రమణంలో వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టింది. దీనిని గ్రేట్ ఇంప్యాక్ట్ అని సైంటిస్టులు పేర్కొంటున్నారు. అత్యంత వేగంతో ఈ గ్రేట్ ఇంప్యాక్ట్ జరగడంతో థియా గ్రహం భాగాలు కొన్ని భూమిలో ఉండిపోగా, ఈ రెండింటి కాంబినేషన్లో మరో గ్రహం లాంటి భాగం సౌర వ్యవస్థలో వచ్చి చేరింది. ఆ థియా భాగాలే ఇప్పుడు కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ముద్దలుగా డెన్సీ రాక్స్గా మారి, భూమి కోర్ చుట్టూ అక్కడక్కడా చేరాయి. అలాగే థియా ఢీకొన్న తర్వాత ఏర్పడిన కొత్త గ్రహం సూర్యుడి చుట్టూ కాకుండా భూమిని చుట్టూ పరిభ్రమిస్తోంది. కాబట్టి ఇది భూమికి ఉపగ్రహంగా మారింది. అదే మన చంద్రుడు. ఈ గ్రేట్ ఇంప్యాక్ట్  జరిగి 450 కోట్ల ఏండ్లు అయ్యుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఆఫ్రికా, పసిఫిక్ కిందనే.. థియా గ్రహం భూమిని గుద్దిన తర్వాత కొన్ని కోట్ల ఏండ్లలో కోర్ ఏరియా చుట్టూ చేరిన ఎల్ఎల్ఎస్వీపీ ముద్దలు భారీగా ఆఫ్రికా, పసిఫిక్ సముద్రం కింది భాగాల్లో ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. రెండు గ్రహాల కొలిజన్ జరిగిన కొత్తలో థియా గ్రహం ముక్కలు భూమి లోపలి పొరల్లో చుట్టూ అక్కడక్కడా పడి ఉండేవని, అవి తర్వాత గడిచిన 450 కోట్ల ఏండ్లు క్రమంగా కోర్కు రెండు వైపులా ‘ఇయర్ ఫోన్స్’ తగిలించినట్లుగా పెద్ద కొండల మాదిరిగా వచ్చి చేరాయని చెప్పారు. కోర్కు ఆనుకుని అక్కడి నుంచి వెయ్యి కిలోమీటర్ల ఎత్తు, కొన్ని వేల కిలోమీటర్ల వెడల్పుతో ఇవి ఉన్నాయని,  వీటి వల్ల భూమి అయస్కాంత క్షేత్రంపై కొంత ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఎల్ఎల్ఎస్వీపీలు భూమి కోర్లో ఉండే రాతి భాగం కంటే 3.5%  ఎక్కువ డెన్సిటీతో ఉన్నాయని, అలాగే ఎక్కువ భాగం ఐరన్తో ఉన్నప్పటికీ కెమికల్గా ఎర్త్ కోర్తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు పేర్కొన్నారు.