
- ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లతో అవకతవకలకు ఆస్కారం
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హాల్‌టిక్కెట్ల జారీ నుంచి మూల్యాంకనం వరకు అన్నీ అవకతవకలకు పాల్పడిందంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. గ్రూప్1 అవకతకవలపై దాఖలైన నాలుగు పిటిషన్లను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాదులు సురేందర్ రావు, రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టిక్కెట్లను జారీ చేయడం ద్వారా టీజీపీఎస్సీ అవకతవకలకు ఆస్కారం కల్పించిందన్నారు.
జనవరి 11 నుంచి జనవరి 25 వరకు మూల్యాంకనం నిమిత్తం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు టీజీపీఎస్సీ లేఖ రాసిందని, అయితే, ఆ లేఖ రాయకముందే ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం వెళ్లిందన్నారు. తెలుగులో పరీక్ష రాసిన పేపర్లను ఇంగ్లిషు వచ్చిన ప్రొఫెసర్లు ఎలా మూల్యాంకనం చేశారో స్పష్టం చేయలేదన్నారు మూల్యాంకనం తొలిసారి చేసిన వాళ్లకి, రెండో వ్యక్తి బండిల్ నంబర్‌తో ఇస్తారని, మూడో వ్యక్తికి ఇవ్వరని, పక్కన కాలమ్‌లో మార్కులు వేస్తారని, ఇందుకు ప్రాతిపదిక మాత్రం ఉండదన్నారు.
మూల్యాంకనం చేశారా లేదా అన్న విషయాన్ని గుర్తించడానికి వీల్లేదన్నారు. అయితే, బండిల్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరివో వాళ్లకు తెలుసునన్నారు. ఒక టీమ్‌లోని ప్రొఫెసర్లతో ఒక పేపరును ఒకరు దిద్దిన తర్వాత అదే టీమ్‌లోని మరొకరితో దిద్దించారని చెప్పారు. వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.