
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశాలకు వచ్చేటప్పుడు పూర్తి వివరాలతో రావాలన్నారు.
అభివృద్ధి లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని, తనకు పంపే ప్రతీ ఫైల్ ను ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని సూచించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన గురుకులాలను సందర్శించాలని చెప్పారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించాలని, అభివృద్ధి పనులు పెండింగ్లో పడకుండా చూడాలన్నారు. అడిషనల్కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.