
కోదాడ, వెలుగు : నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. కోదాడ మండలం గుడిబండకు చెందిన గోపి, నాగేశ్వరి దంపతులకు కొడుకు మహదేవ్(20 నెలలు) ఉన్నాడు. గోపి పనిమీద మంగళవారం మిర్యాలగూడ వెళ్లాడు.
నాగేశ్వరి కొడుకుతో ఇంట్లో నిద్రపోయింది. ఆమె కంటే ముందు నిద్రలేచిన బాబు ఆడుకుంటూ ఇంటి వెనకాల సంపు వద్దకు వెళ్లి అందులో పడ్డాడు. తల్లి లేచి చూసేసరికి కొడుకు కనిపించకపోడంతో ఆందోళన చెంది ఇంటి వెనకాలకు వెళ్లి చూసేసరికి సంపులో చనిపోయి కనిపించాడు. తల్లి ఏడుపు విని స్థానికులు అక్కడికి వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి గోపి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.