శరీర భాగాలను బ్యాగులో తీసుకెళ్లి.. రెండ్రోజుల తర్వాత దహనం

శరీర భాగాలను బ్యాగులో తీసుకెళ్లి.. రెండ్రోజుల తర్వాత దహనం

బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గెట్ టు గెదర్ పార్టీ పేరుతో జనవరి 16న హత్యకు కుట్ర చేసినట్లు చెప్పారు. ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఫిబ్రవరి 17న ప్లాన్ చేసి హత్య చేసినట్లు తేలింది. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్‌ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు కృష్ణ గడిపినట్లు రిమాండ్‌ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్‌ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్‌ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 

ఫిబ్రవరి 17న రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్‌ తిరుమల వైన్స్‌ వద్ద నవీన్‌, హరిహర కృష్ణ మద్యం సేవించినట్లు సీసీఫుటేజ్‭లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్‌, నాగోల్‌, ముసారంబాగ్‌, సైదాబాద్‌, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి తిరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ముందు నవీన్‭ను గొంతు నులిమి కృష్ణ హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం కత్తితో నవీన్‌ శరీర భాగాలను వేరు చేసి.. తలతో సహా శరీర భాగాలను బ్యాగ్‭లో తీసుకెళ్లినట్లు వివరించారు. తన మొబైల్ ను హైదరాబాద్ లోని ఇంట్లో వదిలేసిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్ లో రెండు రోజుల పాటు గడిపినట్లు విచారణలో వెల్లడైంది. ఫిబ్రవరి 23న తిరిగి వరంగల్‌ చేరుకొని తండ్రికి నవీన్‌ హత్య గురించి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలో నవీన్‌ శరీర భాగాలతో పాటు ఆధారాలను తగలబెట్టిన కృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఇక కృష్ణను 14 రోజుల రిమాండ్ నిమిత్తం.. చర్లపల్లి జైలుకు తరలించారు.