మహా పాలిటిక్స్..వైరల్ అవుతున్నఆనంద్ మహీంద్రా వీడియో

మహా పాలిటిక్స్..వైరల్ అవుతున్నఆనంద్ మహీంద్రా వీడియో

మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. రాత్రికి రాత్రే బీజేపీకి ఎన్సీపీ మద్దతివ్వడంతో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  శుక్రవారం రాత్రి వరకు శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్న తరుణంలో ఒక్క రాత్రితో శివసేన నోటికొచ్చిన ముక్కను బీజేపీ లాక్కెళ్లినట్టయింది.

అయితే మహారాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ బిజినెస్ మాన్ ఆనంద్ మహీంద్ర గతంలో పోస్ట్ చేసిన ఓ వీడియోను రీట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నేను గతంలో పోస్ట్ చేసిన ఈ వీడియో గుర్తుకుందా? ప్రస్తుతం మహారాష్ట్రలో ఏం జరుగుతుందో  ఈ వీడియో ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చా?  ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఓటమిని  విజయంగా మార్చవచ్చు.. అందు కోసం చివరి క్షణం వరకు పోరాడాలి. ఇలాంటి వీడియో మీకు అరుదుగా దొరుకుతుంది. ఒక్క సారి చూడండి‘ అని ట్వీట్ చేశారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..కబడ్డీ ఆడుతున్న జట్టులో కూతకు వెళ్లిన ఓ మెంబర్ అవతలి జట్టు మెంబర్ ను  టచ్ చేసి వెళ్లి మిడ్ లైన్ దగ్గర నిల్చుంటాడు. పాయింట్ వచ్చింది ఇక తనదే విజయం అన్నట్టుగా ఉత్సాహంతో ఉంటాడు. ఇంతలోనే ఓటమి ఖాయమనుకున్న ఓ ఆటగాడు వెళ్లి  మిడ్ లైన్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి నిలబడి చూస్తూ.. ఒక్కసారిగా అతని నడుం పట్టుకుని లాగేశాడు. మిగతా ఆటగాళ్లు వచ్చి అతని పాయింట్ వెళ్లకుండా దక్కించుకుంటారు.

తమదే విజయం ఖాయమని ధీమాగా ఉన్న వ్యక్తి అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. ఓటమి  ఖాయమనుకున్న వ్యక్తి చివర వరకు పోరాడి విజయం సాధించాడని ఇలా ఆనంద్ మహీంద్ర మహారాష్ట్ర రాజకీయాలను పోలుస్తూ ట్వీట్ చేశాడు. ఇపుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.