సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మన నుంచి దూరమై నేటికి ఏడాది కావస్తుంది. నేడు ఆగస్టు 22న వారి ప్రథమ వర్ధంతి. ఈ సందర్బంగా సురవరం చేసిన ప్రజా, సామాజిక సేవలను స్మరించుకుందాం. వారు చేపట్టిన ఉద్యమాల కార్యాచరణ, నిర్వహించిన పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వారి తండ్రి సురవరం వెంకటరామిరెడ్డి ఉద్యమ వారసత్వంతో విద్యార్థి దశలోనే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులై.. మన దేశ వామపక్ష ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1974-–75లో యువజనులకు18 సంవత్సరాలకే ఓటింగ్ రైట్ కల్పించాలని 'ఓటింగ్ రైట్ ఏట్ ఏజ్ అఫ్ ఎయిటీన్' పేరిట దేశవ్యాప్తంగా ఉద్యమించారు. అనేక ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు.
ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగం
పెట్టుబడిదారీ విధానం, పెరుగుతున్న నిరుద్యోగిత,- అసమానతలపై వ్యాసాలతోపాటు అనేక అంశాలపై ప్రసంగించారు. 1998– 2004లో రెండు దఫాలు నల్గొండ పార్లమెంట్ నుంచి ఎన్నికై పార్లమెంటులో ప్రజాగళం వినిపించారు. 2005లో ఇండియన్ పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్‌కు నాయకత్వం వహించి ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించారు.
ఆదర్శవంతమైన కమ్యూనిస్టు
ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు చాలా శక్తిమంతంగా వెల్లడించేవారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా, కార్యదర్శివర్గ సభ్యుడుగా పనిచేశారు. 1997లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, 1999 నుంచి 2005 వరకు కార్యదర్శిగా, ఆ తరువాత జాతీయ కార్యదర్శిగా, 2009లో జాతీయ సహాయ కార్యదర్శిగా, 2013 నుంచి 2019 వరకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. సురవరం చేసిన ప్రజాసేవను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళి అర్పిద్దాం.
- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ లీడర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
