హైదరాబాద్ హైటెక్ సిటీ ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత

హైదరాబాద్ హైటెక్  సిటీ ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
  • 3 నెలలుగా ఫ్లై ఓవర్ పనులు, యూటర్న్​లతో ట్రాఫిక్ కష్టాలు 
  • నరకం చూసిన ఐటీ ఎంప్లాయీస్, వాహనదారులు
  • గడువు లోపు పనులు పూర్తిచేయని బల్దియా 
  • తీవ్ర వ్యతిరేకత రావడంతో డైవర్షన్ ఎత్తివేత  
  • మళ్లీ రాకపోకలకు పోలీసుల అనుమతి

గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్​లోని గచ్చిబౌలి – కొండాపూర్​రూట్​లో ఫ్లై ఓవర్ ​నిర్మాణ పనుల కారణంగా సైబరాబాద్​ పోలీసులు విధించిన ట్రాఫిక్​ డైవర్షన్​తో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు 3 నెలల పాటు ముప్ప తిప్పలు పడ్డారు. ఫ్లైఓవర్​నిర్మాణ పనులు తొందరగా కంప్లీట్​చేయడానికి సైబరాబాద్​పోలీసులు ట్రాఫిక్​ డైవర్షన్​పెట్టారు. దీంతో ఎక్కడ యూటర్న్​ ఉందో.. ఎక్కడ వెహికల్స్​ను టర్న్​ తీసుకోవాలో.. యూటర్న్ లు ఎప్పుడూ క్లోజ్​చేస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో గచ్చిబౌలి, ఐకియా, సైబర్​టవర్స్​ జంక్షన్​లు ట్రాఫిక్​ పద్మవ్యూహాన్ని తలపించాయి. 30 నిమిషాల జర్నీకి మూడు, నాలుగు గంటల సమయం పట్టేది. ట్రాఫిక్ డైవర్షన్ గడువు పూర్తయినా జీహెచ్​ఎంసీ అధికారులు ఫ్లైఓవర్​పిల్లర్లను కూడా పూర్తి చేయలేదు.  వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా చేసేదేమి లేక తిరిగి వాహనాలను అనుమతిస్తున్నారు. 

ఫ్లై ఓవర్​పూర్తికి ట్రాఫిక్​ డైవర్షన్

 ఐటీ కారిడార్ లో ట్రాఫిక్​ రద్దీని తగ్గించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్​పాస్​లు, లింకు రోడ్లను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ఓఆర్ఆర్​నుంచి ఐకియా వెనకాల వరకు శిల్పాలే అవుట్​ఫ్లైఓవర్ తోపాటు ఫేజ్–​2లో గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్​రూట్​లో మరో ఫ్లైఓవర్​నిర్మాణం చేపట్టింది. కొండాపూర్​రూట్​లో పిల్లర్లను నిర్మించి త్వరగా ఫ్లైఓవర్​పనులు పూర్తి చేసేందుకు బల్దియా అధికారులు వాహనాల రాకపోకలు బంద్ పెట్టి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.  ట్రాఫిక్​ డైవర్షన్​కు సైబరాబాద్ ట్రాఫిక్​ పోలీసులు సిద్ధమయ్యారు. మే13వ తేదీ నుంచి ఆగస్టు10వ తేదీ వరకు ట్రాఫిక్​ డైవర్షన్​అమలు చేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్​ సీపీ నారాయణ్ నాయక్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, వాహనదారులకు తెలిసేలా మీడియాలో న్యూస్​ కవరేజ్​చేసేందుకు మీడియా ప్రతినిధులను తీసుకొని జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి జాయింట్​సీపీ ఐటీ కారిడార్​లో పర్యటించారు. ఎక్కడ ట్రాఫిక్​డైవర్షన్​ఉంది, యూటర్న్​ఎక్కడ ఉందనే అంశాలను బస్సులో తిప్పుతూ వివరించారు.

ట్రాఫిక్ కష్టాలు తట్టుకోలేక..

ఫ్లైఓవర్​ నిర్మాణ పనుల్లో భాగంగా 90 రోజుల ట్రాఫిక్ డైవర్షన్​ కారణంగా ఐటీ ఉద్యోగులు ముప్పతిప్పలు పడ్డారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్​లో నరకం అనుభవించారు. ట్రాఫిక్​ జామ్​ల తో  టైంకు ఆఫీస్​లకు వెళ్లలేకపోయారు. కొందరూ వర్క్​ ఫ్రంహోమ్​ కు షిఫ్ట్ అయ్యారు. గచ్చిబౌలి, ఐఐఐటీ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్​టీయూ రూట్, డెలాయిట్​ నుంచి ఇనార్బిట్​మాల్​రూట్లలో నిత్యం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అరగంట జర్నీకి గంట, రెండు గంటల సమయం పట్టింది. వాన పడితే గంటల పాటు ట్రాఫిక్​లోనే ఉండాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ రూట్లు కూడా చూపెట్టకుండా ట్రాఫిక్​ ఉన్నతాధికారులు అమలు చేసిన డైవర్షన్​ తో వాహనదారులు ట్రాఫిక్​ సిబ్బందితో గొడవకు కూడా దిగారు. 

తీవ్ర వ్యతిరేకత కారణంగా..

ఐటీ కారిడార్ లో  ట్రాఫిక్​ డైవర్షన్​పై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. నిత్యం ట్రాఫిక్​లో తిప్పలు పడుతుండగా ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్​ పోలీసులు, బల్దియా అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏ రూట్​లో ట్రావెల్​ చేసినా ట్రాఫిక్​ జామ్ లు కావడం, ప్రత్యామ్నాయ రూట్​ లు చూపకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ డైవర్షన్​అమలు తేదీ ముగియడంతో  వాహనదారుల నుంచి మరింతగా వ్యతిరేకత వచ్చింది. దీంతో  సైబరాబాద్​ట్రాఫిక్​ పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పది రోజు కిందట వరకు గచ్చిబౌలి – కొండాపూర్​ రూట్​లో పంపించగా.. శనివారం నుంచి రెండు వైపులా అనుమతించారు.

గడువు దాటినా సగమే పూర్తి.. 

ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలి ఓఆర్ఆర్​నుంచి కొండాపూర్​వైపు నిర్మించే శిల్పా లేఅవుట్ ఫేజ్-​2​ ఫ్లై ఓవర్​పనులు త్వరగా పూర్తి చేస్తామని బల్దియా అధికారులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. ఓఆర్ఆర్​నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. గచ్చిబౌలి చౌరస్తా నుంచి కొండాపూర్​వైపు పిల్లర్లను 3 నెలల్లో పూర్తి చేసి ఫ్లైఓవర్​ పనులను తుది దశకు తీసుకువస్తామని చెప్పారు. గడువు మూడు నెలలు దాటినా పిల్లర్ల నిర్మాణం కూడా కంప్లీట్​చేయలేదు. కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే మిగిలాయి. వాటికి మరో ఏడాది పట్టేలా ఉందని.. అప్పటివరకు తిప్పలేనని ఓ ట్రాఫిక్​ అధికారి పేర్కొన్నారు.