అద్దెలు భరించలేక షిఫ్ట్ చేస్తున్నరు

అద్దెలు భరించలేక  షిఫ్ట్ చేస్తున్నరు
  • చిన్న బిజినెస్​లు చేసే వారిపైనే ఎక్కువ ఎఫెక్ట్ 
  • గ్రేటర్​లో వందకిపైగా పెరిగిన కమర్షియల్ రోడ్లు
  • ట్యాక్స్ లు పెంచేసిన బిల్డింగ్​ల  ఓనర్లు 
  •  మెయిన్​రోడ్లపై చిన్నషాపు కావాలన్నా రూ.25 వేలు కిరాయి 
  •  బిజినెస్​లను లోపలి రోడ్ల వైపు మార్చుతున్న  వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో మెయిన్ రోడ్లపై ఉండే కమర్షియల్ బిల్డింగ్ ల్లో అద్దెలు భారంగా మారాయి. ఓనర్లు ఒక్కసారిగా రెంట్లు పెంచుతుండగా చిన్న వ్యాపారులు కట్టలేని పరిస్థితిలో నాన్ కమర్షియల్ ఏరియాల్లోకి  షిఫ్ట్ చేస్తున్నారు. కొందరు అద్దెలు తక్కువగా ఉండే గల్లీలో షాపులు ఓపెన్ చేసి బిజినెస్ లు కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంపీ ఏరియాతో పాటు గ్రేటర్ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెయిన్ రోడ్లపై  400 స్క్రైర్ ఫీట్ల షెటర్ అద్దె డిమాండ్ ని బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలకిపైగా, ఇంటర్నల్ కమర్షియల్ రోడ్డులో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, నాన్ కమర్షియల్ ఏరియాలో రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. కోర్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది.  

బిల్డిండ్ స్పేస్ ని బట్టి ఇంతకు ఎక్కువగా ఉన్న వాటికి అదే తరహాలో అద్దెలు ఉన్నాయి. బిజినెస్​ లు బాగా జరిగే వారు అక్కడే ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నప్పటికీ, సరిగా నడవని వారు వేరే చోటకు వెళ్లేందుకు షిఫ్ట్ అవుతున్నారు. సుమారు10 నుంచి 15 ఏళ్లుగా ఒకేచోట వ్యాపారాలు చేస్తున్న వారు కూడా రెంట్లు భరించలేక  వెళ్తున్నారు. భారంగా మారిన అద్దెల ఇబ్బందులు తట్టుకోలేకనే వెళ్తున్నట్టు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. 

పెరిగిన కమర్షియల్ రోడ్లు..

గ్రేటర్ పరిధిలో  కమర్షియల్ రోడ్లను పెంచుతూ ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 66 రోడ్లు ఉండగా,  మరో 118  కమర్షియల్​రోడ్లుగా పెంచింది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పర్మిషన్లకు, వ్యాపార సముదాయాలకు తీసుకునే పర్మిషన్ ఫీజులు సైతం పెరిగాయి.  ట్యాక్స్​లు చెల్లించని వారికి నోటీసులు సైతం జారీ చేసి అధికారులు ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారు. అంతకుముందు వరకు ఆయా ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ట్యాక్స్ లు  కలెక్ట్ చేసినప్పటికీ, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్​లు వసూలు చేస్తున్నారు.  ఒక్కో స్కైర్ ఫీట్ పై ఒక్కసారిగా నాలుగైదు రూపాయలు పెరిగింది.  దీంతో ఆ భారాన్ని అద్దెకుంటున్న వ్యాపారులపై ఓనర్లు వేస్తున్నారు. గతేడాది నుంచి అద్దెలు ఒక్కసారిగా పెంచుతున్నారు. ఆ భారాన్ని భరించలేని వారు ఖాళీ చేసి వేరేచోటకు షిఫ్ట్ అవుతున్నారు. 

 కూల్చి కొత్తగా నిర్మాణాలు.. 

కమర్షియల్ ప్రాంతాల్లోని పాత భవనాలనే కూల్చివేసి వాటి స్థానాల్లో కొత్తవి నిర్మిస్తున్నారు. దీంతో అద్దెలను పెంచుతున్నారు. నిర్మాణం పేరుతో  ఏళ్లుగా ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఆ తర్వాత అద్దె ఎక్కువగా ఇచ్చే వారికి ఇస్తున్నారు. ప్రస్తుతం మెయిన్ రోడ్లపై కొత్తగా నిర్మించిన వాటితో పాటు కొన్నిచోట్ల ఇది వరకు ఉన్న షాపులు ఖాళీ చేసి వెళ్లడంతో  కమర్షియల్ స్పేస్ లేదా టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మాదాపూర్ లోని 100 ఫీట్ల రోడ్డులోనూ పదుల సంఖ్యలో ఇలాంటి బోర్డులు కనిపిస్తున్నాయి. సుచిత్ర నుంచి చింతల్ రూట్ లోనూ, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ తో పాటు నిజాంపేట్ లోని బాచుపల్లి, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లోనూ మెయిన్ రోడ్లపై కమర్షియల్ స్పేస్  అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అద్దెలు పెంచడంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన భవనాలకే కనిపిస్తున్నాయి. 

పేరున్నవి కూడా గల్లీల్లోకే.. 

సిటీలో ప్రతి ఏరియాలో ఒక అడ్డా మాదిరిగా ఏదో ఒక షాపు లేదా హోటల్స్, కేఫ్ లు ఉన్నాయి. అలాంటి పేరున్న అడ్డాలు ఇప్పటికే చాలా వరకు కనుమరుగయ్యాయి. ఇప్పుడు రోజురోజుకు మరిన్ని ఖాళీ అవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా అద్దెలు పెంచడమేనని వ్యాపారులు చెబుతున్నారు. చిక్కడపల్లిలో మెయిన్ రోడ్డపై ఎంతో పేరున్న ఓ బేకరి ఉన్నట్టుండి అక్కడి నుంచి వేరేచోటకు షిప్ట్ అయింది. ఎందుకలా అని అడిగితే .. అద్దె భరించలేక ఖాళీ చేశానని ఓనర్ చెప్పాడు. మెహిదీపట్నంలో బస్టాండు పక్కనే ఏళ్లుగా  ఉన్న ఓ హోటల్ లోపలి ప్రాంతానికి షిప్ట్ అయింది. దీనికి కూడా అద్దె భారమేనని తెలిసింది. ఇలా కేఫ్ లు, హోటల్స్ నుంచి మొదలు  కొన్ని పెద్ద వ్యాపారాలు చేసేవారు కూడా అద్దెలు భరించలేక ఖాళీ చేస్తున్నారు. ​ 

అద్దె రూ.25 వేలు చేసిన్రు 

మెయిన్ ​రోడ్ మీద ఆరేండ్లుగా హార్డ్​వేర్ షాపు నడిపిన. గతేడాది వరకు అద్దె రూ.15 వేలు ఉండేది. ఒక్కసారి రూ.25వేలకు పెంచారు. అద్దె భారం కావడంతో కొద్దిగా లోపలి రోడ్డులోకి షిఫ్ట్ చేసిన. బిజినెస్​ పికప్ అయ్యేంత వరకు ఇబ్బందిగా ఉంటుంది.  కానీ.. నెలకు రూ.10 వేలు అద్దె మిగులుతుంది.
–  ప్రవీణ్, వ్యాపారి, షేక్​పేట