
ఆదిలాబాద్, వెలుగు: రేణుకా సిమెంట్స్ నిర్వాసితుల ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తే ఊరుకోమని బీజేపీ నేత జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భూ నిర్వాసితుల కోసం న్యాయంగా పోరాటం చేస్తుంటే అక్రమ కేసులతో ఎమ్మెల్యే జోగు రామన్న భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
జోగురామన్నకి మేలు చేసేలా ఎవరు ఉద్యమం చేస్తున్నారో, ఆయన వైఫల్యాల మీద ఎవరో పోరాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొంతమంది రైతులను పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని, కావాలనే ఉద్యమం ముసుగులో గొడవలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు.