ప్రొటీన్​లతో  గుండె కణాలకు రిపేర్.. ఎలుకలపై అమెరికా  సైంటిస్టుల ప్రయోగం సక్సెస్ 

ప్రొటీన్​లతో  గుండె కణాలకు రిపేర్.. ఎలుకలపై అమెరికా  సైంటిస్టుల ప్రయోగం సక్సెస్ 

న్యూఢిల్లీ: హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెలోని కండరాల్లో ఉండే కొన్ని కణాలు దెబ్బతింటాయి. సకాలంలో చికిత్స అందకుంటే అవి శాశ్వతంగా చచ్చుబడిపోయి ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. ఇలా దెబ్బతినే గుండె కండర కణాలను రిపేర్​చేయగలిగే నాలుగు ప్రొటీన్లను అమెరికాలోని సాన్​ఫర్డ్ బర్న్​హాం ప్రెబై సంస్థ సైంటిస్టులు గుర్తించారు. వాటిని హార్ట్ ఎటాక్​ ఎదుర్కొన్న ఎలుకల గుండె కండరాల్లోకి ప్రవేశపెట్టి జరిపిన రీసెర్చ్​లో సానుకూల ఫలితాలు వచ్చాయి.

వీటి ప్రభావంతో.. ఆ ఎలుకల గుండె కండరాల పనితీరు మునుపటి కంటే 50 శాతం మెరుగుపడిందని వెల్లడైంది. దెబ్బతిన్న గుండె కండర కణాలను ‘ఏజేఎస్ జడ్’ అనే గ్రూప్ కు చెందిన నాలుగు ప్రొటీన్లు రిపేర్​చేసి పూర్వస్థితికి తీసుకొచ్చాయని సైంటిస్టులు వెల్లడించారు. గుండెజబ్బులతో పాటు పార్కిన్సన్స్, న్యూరో మస్క్యులర్ రోగాలకు ఈ తరహా ప్రొటీన్ చికిత్స చేయొచ్చని తెలిపారు. ఈ రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్​లో పబ్లిష్​అయ్యాయి.