పేరూరు, నిడమనూరు బ్రిడ్జికి రిపేర్లు చేయించరూ..!

పేరూరు, నిడమనూరు బ్రిడ్జికి రిపేర్లు చేయించరూ..!
  • 15  రోజులుగా ఆయా గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • కనీసం తాత్కాలిక పనులు కూడా చేయని వైనం
  • తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు 

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా, పేరూరు గ్రామాల మధ్య సోమసముద్రం చెరువు వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షాలు, వరద నీటి కారణంగా ఈ నెల 9న కూలిపోయింది. దీంతో  హాలియా నుంచి పేరూరు, చిలకాపురం, కొరివేణిగూడెం, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డి గూడెం గ్రామాల నుంచి 15 రోజులుగా ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ పనుల నిమిత్తం ప్రజలు హాలియా మండల కేంద్రానికి రావాలంటే  తెగిపోయిన  బ్రిడ్జిని చెరువు అలుగు నీటినిలోంచి నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది.  శుక్రవారం అలుగు దాటుతున్న ఓ వ్యక్తి నీటి ఉధృతిలో కొట్టుకుపోగా స్థానికులు అతడిని కాపాడారు. నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే జైవీర్​రెడ్డి, కలెక్టర్​ ఇలా త్రిపాఠితో కలిసి ఈ నెల 10న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

తాత్కాలిక వంతెనకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కలెక్టర్ కు సూచించారు. కానీ ఇప్పటి వరకు తాత్కాలిక మర్మతులు చేపట్టలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడమనూరు మండలంలోని నిడమనూరు, బంకాపురం గ్రామాల మద్య చిలకల వాగుపై  పూర్వకాలంలో నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరుకుని, పూర్తిగా ధ్వంసమైంది. 

దీంతో బంకాపురం, వెనిగండ్ల, సూరేపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు చేస్తుంటారు. వాగుపై  నిర్మించిన కల్వర్టు ధ్వంసం కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం నిడమనూరు మండల కేంద్రానికి రావాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో  నీటిని దాటుకుంటూ రావాల్సిఉంటుంది. త్రిపురారం మండలం దుగ్గేపల్లి బంధం దుర్గా నగర్  మధ్య ఉన్న బ్రిడ్జి  రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.  కల్వర్టు శాంక్షన్ అయి చాలా రోజులైనా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టలేదని ఇకనైనా నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.