టీచర్ పోస్టుల భర్తీ..రేషనలైజేషన్ తర్వాతే!

V6 Velugu Posted on Jul 22, 2021

  • తక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లలో టీచర్ పోస్టులను రద్దు చేసే యోచన
  • అఫిషియల్​గా 12,943 ఖాళీలు..
  • 1,384 పోస్టులే భర్తీ చేయాల్సి ఉందని సర్కారు జాబితా
  • విద్యా వలంటీర్ల పోస్టులనూ ఖాళీల కింద చూపాలంటున్న నిరుద్యోగులు

    బడులు, టీచర్ల రేషనలైజేషన్​పై సర్కారు ఫోకస్​పెట్టింది. పిల్లలు సరిపోను సంఖ్యలో లేరనే సాకుతో స్కూళ్లతోపాటు టీచర్​ పోస్టులనూ తగ్గించే ప్లాన్​ చేస్తోంది. టీచర్ పోస్టుల ఖాళీలపైనా ప్రభుత్వం పూటకో లెక్క చెబుతోంది. తాజాగా ప్రకటించిన లిస్టులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 1,384 పోస్టులే ఖాళీగా ఉన్నట్టు చెప్పగా.. కేంద్రానికి పంపిన వివరాల్లో మాత్రం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూపించింది. స్కూళ్లు, టీచర్ల రేషనలైజేషన్ చేయాలనే ఆలోచనే ఈ లెక్కల గందరగోళానికి కారణమని సర్కారు పెద్దలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల్లేని స్కూళ్లలోని టీచర్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ స్కూళ్లలో 12 వేల మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారని, ఇవన్నీ ఖాళీలేనని నిరుద్యోగులు చెప్తున్నారు.


హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం పూటకో లెక్క చెబుతోంది. తాజాగా ప్రకటించిన లిస్టులో సెకండరీ ఎడ్యుకేషన్‌‌‌‌లో 1,384 పోస్టులే ఖాళీగా ఉన్నట్టు చెప్పగా.. కేంద్రానికి పంపిన వివరాల్లో మాత్రం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూపించింది. స్కూళ్లు, టీచర్ల రేషనలై జేషన్ చేయాలనే ఆలోచనే ఈ లెక్కల గందరగోళానికి కారణమని సర్కారు పెద్దలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల్లేని స్కూళ్లలోని టీచర్ పోస్టులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 
మొత్తం 1,38,517 టీచర్ పోస్టులు
రాష్ట్రంలోని 26,050 సర్కారు స్కూళ్లలో 20 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో 1.07 లక్షల మంది టీచర్లు, 12 వేల మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. వలంటీర్లను ఈ ఏడాది ఇంకా రెన్యువల్ చేయలేదు. నాలుగేండ్ల కిందట 8,792 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్​ ఇచ్చినా, వీటిలో కొన్ని పోస్టులకు అభ్యర్థులు లేరని ఖాళీగానే పెట్టారు. ఈ మధ్య కేంద్రానికి పంపిన లెక్కల ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్​ పరిధిలో (సర్కారు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు) 1,38,517 శాంక్షన్ టీచర్ పోస్టులుంటే, వాటిలో 1,25,574 మంది మాత్రమే పని చేస్తున్నారు. మరో12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ వైడ్​గా 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పగా.. అందులో సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ పేరుతో 1,384 పోస్టులే భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. ఇవి కూడా మోడల్ స్కూళ్లలోని ఖాళీలేనని అధికారులు చెప్తున్నారు. 
స్టూడెంట్ల కన్నా టీచర్లు ఎక్కువ!
బడుల్లో టీచర్లు, పిల్లల నిష్పత్తితో పోలిస్తే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​లోనే 9,221 పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అందుకే టీచర్ పోస్టులను అధికారిక ఖాళీ లెక్కల్లో చూపించలేదని తెలుస్తోంది. స్టేట్​లో మొత్తం 1,243 జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్లున్నాయి. వీటిలో 1,732 మంది టీచర్లు పనిచేస్తున్నారు. పది లోపు పిల్లలున్న ప్రైమరీ స్కూళ్లే 1,412 ఉండగా.. వాటిలో 2,114 మంది టీచర్లు పనిచేస్తున్నారు. పది లోపు స్టూడెంట్లున్న హైస్కూళ్లు 12 ఉండగా, వాటిలో 88 మంది టీచర్లున్నారు. ఐదారుగురు స్టూడెంట్లు ఉన్న స్కూళ్లను రేషనలైజేషన్ చేయాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం ఆన్​లైన్ పాఠాలే కొనసాగుతుండటంతో, జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో ఆయా స్కూళ్లలోని పోస్టులనే రద్దు చేసే యోచనలో సర్కారు ఉంది. ఈ క్రమంలో స్టూడెంట్, టీచర్ రేషియో పరిగణనలోకి తీసుకుంటే, భారీగా టీచర్ పోస్టులు రద్దయ్యే అవకాశముంది. ఇప్పటికే జీరో ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్ స్కూళ్లు, తక్కువ స్టూడెంట్లున్న స్కూళ్లలోని టీచర్లను డిప్యూటేషన్​పై వేరే స్కూళ్లకు అధికారులు పంపించారు.
టీచర్ల యూనియన్లతో మంతనాలు
బడులు, టీచర్ల రేషనలైజేషన్​పై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని టీచర్ల యూనియన్ల లీడర్లు కలిసినప్పుడు రేషనలైజేషన్​పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. సర్కారు పర్మిషన్ ఇస్తే వెంటనే స్కూళ్లు, టీచర్ పోస్టులను రేషనలైజేషన్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రెడీగా ఉన్నారు. అయితే కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు చేయాలనే ఆలోచన సర్కారులో ఉంది. దీంతో ఈ ప్రక్రియ పూర్తయ్యాక చేయాలా లేక ముందే చేయాలా అనే దానిపై సర్కారు పెద్దల్లో చర్చలు నడుస్తున్నట్టు సమాచారం.
టీఆర్టీ లేనట్టేనా?
ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2017లో సర్కారు బడుల్లో టీచర్ల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్​ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీచర్లు ఎక్కువగానే ఉన్నారని సర్కారు పెద్దలు, విద్యా శాఖ ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. 12 వేల మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారని, ఇవన్నీ ఖాళీలన్నట్టేనని నిరుద్యోగులు చెప్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశమే లేదని నిరుద్యోగ సంఘాలు, టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. శాంక్షన్ పోస్టులకు అనుగుణంగా ఖాళీలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tagged Telangana, Replacement, rationalization, teacher posts,

Latest Videos

Subscribe Now

More News