వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఇందుకు ప్లాన్ చేసిన ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీతో సంబంధాలున్న మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీ అనే టెర్రరిస్ట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఇరాన్ సైనికాధికారి ఖాసిమ్ సోలేమానీ హత్యకు ప్రతీకారంగా ట్రంప్ బిడ్డను చంపేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. అయితే, ఆ టెర్రరిస్ట్.. ప్లాన్‌ను అమల్లో పెట్టేలోపే అరెస్ట్ అయ్యాడని పేర్కొంది. 32 ఏండ్ల అల్‌సాదీని ఈ నెల 15న తుర్కియేలో అరెస్టు చేసి అనంతరం అమెరికాకు తీసుకువచ్చారు. దర్యాప్తులో అతడు వెల్లడించిన విషయాలను బట్టి ఇవాంక మర్డర్‌కు ప్లాన్ జరిగినట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో బెదిరింపులు
2020లో అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ టాప్ కమాండర్ ఖాసిమ్ సోలేమానీ చనిపోయాడు. దీంతో ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని అల్‌సాదీ అప్పట్లోనే బహిరంగ ప్రకటన చేశాడు. ‘‘మీ రాజభవనాలు, సీక్రెట్ సర్వీస్ మిమ్మల్ని కాపాడలేవు. ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం మాత్రమే మిగిలి ఉంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ట్రంప్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అల్‌సాదీ.. ఇవాంకను లక్ష్యంగా చేసుకుని హత్యకు స్కెచ్ వేశాడు. ఈలోపే అమెరికా దర్యాప్తు సంస్థలు అతడిని గుర్తించి అరెస్ట్ చేశాయి. అల్‌సాదీ నుంచి ఇవాంక నివాసం ఉంటున్న బిల్డింగ్ బ్లూ ప్రింట్ స్వాధీనం చేసుకున్నాయి.
